నాలుగో’సారి’

2

– భూ ఆర్డినెన్సు జారీ!

న్యూఢిల్లీ జులై20(జనంసాక్షి): వివాదాస్పద భూబిల్లును మోడీ ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్‌ రూపంలో జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావడానికి ఎన్డీయే ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించినా, రాజ్యసభలో మెజారిటీ సభ్యులు లేక వీగిపోతోంది. దీంతో ప్రతీ సారి ఆర్డినెన్స్‌ రూపంలోనే కొనసాగించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఆర్డినెన్స్‌ జారీ చేసిన మోడీ ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి బిల్లును సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే గతంలోలానే ఇప్పుడు కూడా రాజ్యసభలో అదే పరిస్థితి ఉండటం, ప్రతిపక్షాలు దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుండటంతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనబడటం లేదు. అంతేకాకుండా భూబిల్లులోని అంశాలను పరిశీలించి, సవరణల కోసం బిజెపి ఎంపి ఎస్‌ఎస్‌ అహ్లువాలియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్‌ కమిటీ తుది నివేదికను సమర్పించడానికి ఆగస్టు 3(రెండు వారాల పొడిగింపు) వరకు సమయాన్ని కోరింది. నివేదిక సమర్పించాక వాటిపై నిర్ణయాలు తీసుకోడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే గడువు ముగిసే రోజునే పార్లమెంటు సమావేశాలు కూడా ముగుస్తున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అత్యధికంగా యుపిఎ ప్రభుత్వం మూడు సార్లు(ఎస్సీ, ఎస్టీ సవరణ-2013, సెక్యూరిటీస్‌ లా ఆర్డినెన్సు- 2013) రెండు ఆర్డినెన్సులను జారీ చేసింది. ఇదిలా ఉండగా, అహ్లువాలియా కమిటీ ఇప్పటి వరకూ బిల్లుపై తీసుకున్న 672 నివేదనల్లో 670 వ్యతిరేక నివేదనలు అందినట్లు తెలిపింది.