నాసికరం చీరలంటూ నిరసనలు

– పలు చోట్ల ఆందోళనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి):తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ఎంపి కవిత, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు. కరీంనగర్‌లో మంత్రి ఈటెల, వరంగల్‌ జిల్లాలో మంత్రి కడియం పాల్గొన్నారు. కాగా ఈ చీరల పంపిణీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారింది. గత నెల రోజుల నుండి తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి, 18ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు చేనేత చీరెలను పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వచ్చారు. కాగా సోమవారం ప్రారంభమైన ఈ చీరెల పంపిణీలో చేనేత చీరెలు కాకుండా సిల్క్‌, పాలిస్టర్‌ చీరలను పంపిణీ చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత చీరెలు ఇస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం కేవలం రూ. 100 ఉండే సిల్క్‌ చీరెలను పంపిణీ చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చీరలను దగ్దం చేసి తమ నిరసను తెలిపారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరెల పంపిణీలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. నాణ్యతలేని చీరెలను పంపిణీ చేశారంటూ మహిళలు నిరసనకు దిగారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలాంటి చీరెలు మాకెందుకంటూ మహిళలు వెనుదిరిగి వెళ్లిపోయారు. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి చీప్‌ బతుకమ్మ చీరలు మాకొద్దంటూ నిరసన వ్యక్తం చేసి, వాటిని తగలబెట్టారు. భవనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో నాసిరకం చీరెలు ఇచ్చారంటూ అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలను కుప్పగా పోసి నిప్పంటించి వాటి చుట్టూ బతుకమ్మలాడారు. అదేవిధంగా జిగిత్యాల నియోజకవర్గం చల్‌గల్‌ గ్రామంలో మహిళలు చీరలకు నిప్పంటించి తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి జిల్లా ఓదెలు మండలం రూపునారాయణపురంలో చీరల పంపిణీ నిలిచిపోయింది. పంపిణీకి కేవలం 50చీరలను మాత్రమే తీసుకరావటంతో అధికారులతీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు నాణ్యతగా లేవని మహిళలు చీరలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేసిన చీరలను తీసుకొనేందుకు మహిళలు ముందుకు రాలేదు. కేవలం 100 రూపాయల చీరలు మాకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత చీరలు ఇస్తామన్న ప్రభుత్వం తీరా నాసిరకంగా ఉన్న చీరలను పంపిణీ చేయటం ఏమిటని మహిళలు తెరాస ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

మాకు ఎటువంటి ఆర్డర్‌ రాలేదు..

బతుకమ్మ పండగ సందర్భంగా తెల్లరేషన్‌ కార్డు ఉండి 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చేనేత చీరలను పంపిణీ చేస్తామని, ఇప్పటికే వాటికోసం ఆర్డర్‌ ఇవ్వటం జరిగిందని, ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాపా వీటిని పంపిణీ చేస్తామని నెల రోజుల నుంచి అటు అధికారులు, ఇటు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా సోమవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చేనేత చీరలు కాకుండా సిల్క్‌ చీరలను పంపిణీ చేయటంతో మహిళలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డర్‌ రాలేదు పోచంపల్లి నేతన్నలు పేర్కొన్నారు. పోచంపల్లి నుంచి ప్రభుత్వం చేనేత చీరలను కొనుగోలు చేయలేదని, మా స్టాక్‌ మా దగ్గరే ఉంది పోచంపల్లి చేనేత నేతన్నలు పేర్కొంటుండటంతో ప్రభుత్వం తీరుపై మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.