నా బిడ్డను ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారేమో?
– యాసిన్ భత్కల్ తల్లి అనుమానం
న్యూఢిల్లీ జులై6(జనంసాక్షి):
ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ తల్లి రెహానా సిద్ధిబా తెలంగాణ రాష్ట్ర పోలీసులపై సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఆ రాష్ట్ర పోలీసుల నుంచి తన బిడ్డకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. అందుకే తన బిడ్డను మరో విచారణ పేరుతో బయటకు తీసుకొచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం చర్లపల్లి కారాగారంలో ఉన్న భత్కల్ తన తల్లి, భార్యకు ఫోన్ చేసి… ఐఎస్‌ఐఎస్ సహకారంతో జైలు నుంచి తప్పించుకుంటానని, డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనని బయటకు తీసుకొస్తారని చెప్పినట్టు వార్తలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై భత్కల్ తల్లి స్పందించారు.
డమాస్కస్ నుంచి వచ్చే వ్యక్తులు తనను బయటకు తీసుకొస్తారని యాసిన్ తమతో ఎన్నడూ చెప్పలేదని ఆమె స్పష్టంచేశారు. వాస్తవానికి, పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మాత్రం తమతో చెప్పాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానాన్ని ఆమె వ్యక్తంచేశారు.
ఇదిలావుండగా, యాసిన్ భత్కల్‌ను సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కోర్టు వద్ద ఈ తీవ్రవాది హల్‌చల్ చేశాడు. అదేసమయంలో పోలీసులపై కూడూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఓ లెటర్‌ను భత్కల్ బయటకు విసిరేశాడు. వెంటనే పోలీసులు లెటర్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
వాస్తవానికి ఈనెల 2వ తేదీన భత్కల్‌ను కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా… కోర్టుకు వచ్చేందుకు భత్కల్ నిరాకరించాడు. ఇదే విషయాన్ని జైలు అధికారులు కోర్టుకు తెలియజేశారు. దీంతో 4వ తేదీన కోర్టుకు తీసుకువచ్చిన సమయంలోనూ కొద్దిసేపు గొడవ జరిగింది. తిరిగి సోమవారం కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు.