నిండుకుండలా శ్రీశైలం జలాశయం
గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన మంత్రి
నంద్యాల,జూలై23(జనంసాక్షి): శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 57,751 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి
రాంబాబు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా ఎడమ గట్టు, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం 11 గంటలకు రేడియల్ క్రేస్ట్ గేట్ల ద్వారా మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుల చేస్తుండటంతో శ్రీశైలానికి భారీగా ప్రవాహం వస్తోంది.ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి రావద్దని సూచించారు. ఇదిలావుంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల భ్రమరాంబిక అతిధి గృహం వద్దకు చేరుకున్న మంత్రికి అంబటి రాంబాబుకు దేవస్థానం కార్యనిర్వహణాధి కారి ఎస్. లవన్న పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. మంత్రి శనివారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకొని జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి డ్యామ్ రేడియల్ క్రస్టు గేట్లు తెరచి దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసారు.
శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.