నిండు సభలో నిస్సిగ్గుగా..
– బీఫ్ తిన్నారని జమ్ము అసెంబ్లీలో ఎమ్మెల్యేపై దాడి
జమ్మూ కాశ్మీర్ అక్టోబర్8(జనంసాక్షి):
అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో విపక్ష సభ్యులు ఆందోళనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ గురువారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇదంతా నిండు సభలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రషీద్ ను లాగి ఒంగోబెట్టి ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే అప్రమత్తమైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు రషీద్ కు మద్దతుగా వెళ్లి అక్కడి నుండి తీసుకెళ్లారు. ఈ దాడికి కారణం ఏమిటంటే.. శ్రీనగర్ ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికీ ‘బీఫ్’ పార్టీ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గో మాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రషీద్ పలు వ్యాఖ్యాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి ఆగ్రహానికి గురైన కాషాయ దళం ఆయనపై దాడికి దిగారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామ వీడియో సంచలనం సృష్టిస్తోంది.