నిజాం నిధి తరలింపుపై ఆధారాల్లేవ్‌: కేంద్రం

1

-వివరాలన్నీ బయటపెట్టండి: సీఐసీ

న్యూఢిల్లీ, మే 5:

ఆరు దశాబ్దాల క్రితం నిజాం నవాబు లండన్‌ బ్యాంకులో దాచిన సొమ్మును పాకిస్థాన్‌కు తరలించిన వ్యవహారానికి సంబంధించి తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2008లో ఇదే అంశంపై పాకిస్థాన్‌తో కోర్టు బయట పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం తాజాగా ఆధారాలు లేవని పేర్కొనటం గమనార్హం. హైదరాబాద్‌ నిజాం విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ లండన్‌లోని ఓ బ్యాంకులో దాచిన పది మిలియన్‌ పౌండ్ల (ప్రస్తుతం 30 మిలియన్‌ పౌండ్లు) సొమ్మును 1948 సెప్టెంబర్‌ 20వ తేదీన పాకిస్థాన్‌ హైకమిషనర్‌ తమ దేశానికి తరలించినట్లు ఆరోపణలున్నాయి.
దీనికి సంబంధించిన ఆధారాలివ్వాలని అక్బర్‌ అలీఖాన్‌ సమాచార హక్కుచట్టం ద్వారా న్యాయశాఖను కోరితే తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని సమాధానం ఇచ్చింది. దాంతో ఆయన కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌.. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టాలని విదేశాంగ, న్యాయశాఖలను ఆదేశించారు.