నిజాం షుగర్‌ అమ్మొద్దని బాబు కాళ్ల వేళ్లా పడ్డా !

C
– అసెంబ్లీలో మంత్రి పోచారం

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిజాం షుగర్స్‌ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఆనాడు  ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్‌ కంపెనీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాళ్లా, వేళ్లా పడి దండం పెట్టినా చంద్రబాబు నాయుడు వినలేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభలో చర్చ సందర్భంగా నిజాం షుగర్‌ కంపెనీపై మంత్రి-విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. బాబు హయాంలో నిజాం షుగర్‌ ప్రైవేటీకరణపై కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే ఫైనల్‌ అన్నారు. తుది నిర్ణయం తీసుకునే రోజు అందరిని పిలిచారు. నిర్ణయం ప్రకటించే ముందు కూడా సార్‌.. మళ్లొక సారి ఆలోచించండి. నిర్ణయం తీసుకోవద్దు. ఇది మాతృ సంస్థ. దీని ద్వారా పది సంస్థలు పుట్టుకు వచ్చాయని చెప్పి కాళ్లా, వేళ్లా పడ్డా పట్టించుకోలేదు. పైగా ఆవేశంతో ఊగిపోయి నా తొడవిూద కొట్టారు. దోతి కట్టుకోవడం కారణంగా నాతొడ ఎర్రగా కందిపోయింది. నిర్ణయం ప్రకటించి వెళ్లిపోయారు.  ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. తొలిసారి చెబుతున్నా. అప్పుడు షుగర్‌ మినిస్టర్‌, నేను పక్కపక్కన కూర్చున్నాం. నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించొద్దని చేతులు జోడించి అడిగాను. అది మదర్‌ యూనిట్‌ అని, దాని ఆధారంగా పది యూనిట్లు వచ్చాయని చెప్పాను. వాటి నష్టాలను దీనివిూద రుద్దొద్దని అడిగాను. అంతే, చంద్రబాబు లేచి ఒక్కసారిగా నా తొడవిూద కొట్టారు. ధోతి వేసుకుంటా కదా, అక్కడంతా ఎర్రగా అయ్యింది అని ఆయన తెలిపారు. ఇన్నాళ్లబట్టి తాను ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని అన్నారు.నేను అక్కడే కూర్చున్నా. కాసేపటి తర్వాత గన్‌మెన్‌ను పంపించి పిలిపించారు. ఎదో ఆవేశంలో అలా చేశాను దెబ్బతగిలిందా అని అడిగాడని అన్నారు. దానికి నేను విూరు కొట్టిన దెబ్బ ఇక్కడ కాదు సార్‌.. నా గుండెవిూద తగిలిందన్నానని పేర్కొన్నారు. ఇప్పుడే ఎందుకు చెప్పానంటే ఆనాటి ఘటన చెప్పాల్సి వచ్చిందన్నారు. కాగా ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణ కిందకు నిజాం షుగర్స్‌ వెళ్లిన విషయం తెలిసిందే. రైతులను ఆదుకోవడంతో పాటు కార్మికులను కాపాడుకునేందుకు ప్రభుత్వమే ఫ్యాక్టరీని నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు నిజాం షుగర్స్‌పై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. దీనిపై ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు కొట్టినా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. దానికి పోచారం శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ, తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో విూరెందుకు కొనసాగారని ప్రశ్నించారు.  తెలంగాణకు కిరణ్‌ ఒక్క రూపాయి ఇవ్వనంటే కాంగ్రెస్‌ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రీకౌంటర్‌ ఇచ్చారు. అప్పటి విషయాన్ని ఇప్పుడెందుకు ప్రస్తావించారని… కేసీఆర్‌ చేసే తప్పులను భవిష్యత్‌లో ప్రస్తావిస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.