నిప్పులు చిమ్ముతూ నింగికి

5
– పీఎస్‌ఎల్‌వీసి- 31 విజయవంతం

నెల్లూరు,జనవరి20(జనంసాక్షి): గగనవీధిలో ఇస్రో మరో విజయబావుటా ఎగురేసింది. తన ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్నినమోదు చేసుకుంది. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా పరిశోధనల్లో మేటి అని నిరూపించుకుంది. బుధవారం ఇక్కడి నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-31 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి  ఉదయం 9.31గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ పక్రియ సోమవారం ప్రారంభమై 48గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన పిదప పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ31 వాహకనౌక 19 నిమిషాల 30సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2016 తొలి అంకంలో ఇస్రో సాధించిన ఘన విజయమని శాస్రవేత్తలు ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్దిందని పేర్కొన్నారు. మరో రెండున్న నెలల్లో మిగతా 2 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని తెలిపారు. 2016 చివరినాటికి స్వదేశీ దిక్చూచిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)కు మరింత ఊతం లభించనుంది. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోవిూటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు.

శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

పీఎస్‌ఎల్వీసీ- సీ31ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రదాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఇస్రో విజయంపై అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను సీఎం అభినందించారు. శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.