నిప్పుల వర్షం

5

భానుడి భగభగలు

ఒక్క రోజులో వందమంది పైగా మృతి

హైదరాబాద్‌,మే22(జనంసాక్షి): రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతకు జనం పిట్టల్లా రాలుతున్నారు. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. వరుసగా ఐదోరోజు కూడా ఎండలు దంచి కొట్టాయి. శుక్రవారం ఒక్కరోజే 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆరుగురు, నల్గొండలో ఐదుగురు, ఆదిలాబాద్‌లో ముగ్గురు, కరీంనగర్‌లో ఇద్దరు, వరంగల్‌లో జిల్లాలో నలుగురు వడదెబ్బకు బలయ్యారు. వడదెబ్బ బాధితులతో జనగామ ప్రభుత్వాస్పత్రి నిండిపోయింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో హైదరాబాద్‌లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక ఏపీలోని ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒకరు వడదెబ్బకు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారడంతో ప్రజలు పనుల కోసం బయటకు రావడం లేదు. అత్యవసరమైతే తప్ప రక్షణతో రోడ్డుపైకి వస్తున్నారు.  ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు 47డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వరంగల్‌ జిల్లా జనగామ ఆసుపత్రి వడ దెబ్బ బాధితులతో నిండిపోయింది. 20 మంది బాధితులు జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా  మంచిర్యాల మండలం నస్పూర్‌ అంబేద్కర్‌ కాలనీలో వడదెబ్బతో వ్యక్తి మృతి చెందాడు.  కాగజ్‌నగర్‌లో ఇద్దరు మృతి చెందారు. తానూరు మండలం మాలింగలో వడదెబ్బతో ఓ వ్యక్తి కన్నుమూశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా  అలంపూర్‌ మండలం బుక్కాపురంలో వడదెబ్బతో కాళిరాములు అనే వ్యక్తి మృతిచెందాడు.  మానవపాడు మండలం తుళ్లూరులో వడదెబ్బ తగిలి వెంకటరాముడు చనిపోయాడు. వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో వడదెబ్బతో మహిళ మరణించింది. మెదక్‌ జిల్లా కల్హేర్‌ మండలం బీబీపేట్‌లో వడదెబ్బకు వృద్ధురాలు గొండు లచ్చవ్వ(60) మృతి చెందింది.కరీంనగర్‌ జిల్లా జమ్మింకుంట మండలం ఇల్లంతకుంటలో వడదెబ్బతో అప్పాల ఓదేలు అనే వృద్ధుడు కన్నుమూశాడు.