నిబంధనల ప్రకారమే కొన్నాం దాచేదేమీ లేదు

హెలిక్యాప్టర్ల స్కామ్‌పై చర్చకు సిద్ధమన్న ఆంటోనీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి):
హెలికాప్టర్ల కుంభకోణంలో వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకొనేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో దాచిపెట్టాల్సిందేవిూ లేదని.. దర్యాప్తు వివరాలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో వెల్లడిస్తామని తెలిపింది. దర్యాప్తు పూర్తయిన అనంతరం దోషులుగా తేలిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పారు. ఆంటోనీ మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… నిబంధనల ప్రకారమే హెలికాప్టర్లను కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. రూ.3,600 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం సందర్భంగా జరిగిన అవకతవకల నేపథ్యంలో రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపడేశారు. అన్ని అంశాలపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమని
ప్రకటించారు. ‘దీంట్లో దాచాల్సింది ఏవిూ లేదు. పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు సిద్ధమవుతున్నాం’ అని అన్నారు. హెలికాప్టర్ల కుంభకోణంపై వస్తున్న వార్తలు బాధకలిగించాయని వ్యాఖ్యానించారు. రక్షణ శాఖకు సంబంధించిన అంశాల్లో రాజకీయ నిర్ణయాలకు ఆస్కారం ఉండదన్నారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. 12 హెలికాప్టర్ల విక్రయానికి సంబంధించి ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలీ కంపెనీ ఫిన్‌మెకానికతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం తొందరపాటవుతుందన్నారు. విూడియాలో వచ్చే వార్తల ఆధారంగా ప్రభుత్వం పని చేయదని… దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం దాచడానికేవిూ లేదని.. వాస్తవాలను వెలికితీసి, దోషులను శిక్షిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బ్రటిష్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌తో పలు ఒప్పందాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైంది. హెలికాప్టర్ల కుంభకోణం, రక్షణ శాఖకు సంబంధించి అంశాలపై చర్చ జరిగినప్పటికీ, ఈ సమావేశానికి ఆంటోనీని ఆహ్వానించలేదని సమాచారం. అయితే, ప్రధాని బృందంలో ఆంటోనీకి ఎందుకు స్థానం కల్పించలేదనే దానిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.