నియంత్రణ రేఖను దాటేందుకు.. ముష్కరుల విఫలయత్నం


– ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు
– ఆర్మీ మేజర్‌, ముగ్గురు సైనికులను  హతమార్చిన ముష్కరులు
శ్రీనగర్‌, ఆగస్టు7(జ‌నంసాక్షి) : నియంత్రణ రేఖ వద్ద ముష్కరులు రెచ్చిపోయారు. చొరబాటు యత్నాన్ని అడ్డుకునే సమయంలో సైనికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ మేజర్‌, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కశ్మీర్‌ ప్రాంతంలోని గురెజ్‌లో ముష్కరులు చొరబాటుకు యత్నిస్తుండగా.. సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్‌, ముగ్గురు సైనికులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ప్రాణాలు పణంగా పెట్టి చొరబాటు యత్నాన్ని సైనికులు అడ్డుకున్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో కనీసం ఇద్దరు ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. గురెజ్‌ సెక్టార్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద నుంచి సుమారు ఎనిమిది మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భారత సైన్యం వారికి దీటుగా బదులిచ్చింది. దీంతో నలుగురు ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. మరణించిన సైనికులను మేజర్‌ కేపీ రాణె, జావిూ సింగ్‌, విక్రమ్‌జీత్‌, మణిదీప్‌లుగా గుర్తించారు.