నియంత్రణ రేఖ దాటొద్దు
ఆక్రిత కాశ్మీరీలకు ఇమ్రాన్ హెచ్చరిక
ఇస్లామాబాద్,అక్టోబర్5 (జనంసాక్షి) : ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో బాధ్యతారహితంగా మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశాన్ని చూసి జడుసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే కాశ్మీర్‌పై తనవాచాలత్వం మాత్రం మార్చుకోలేదు. జమ్మూ-కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్ పిలుపు మేరకు శుక్రవారం కొందరు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ వాసులు రకరకాల వాహనాల్లో ముజఫరాబాద్ చేరుకుని, ప్రదర్శనలు నిర్వహించారు. ఆగ్రహావేశాలతో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ ద్వారా ఇటువంటి మూకలను హెచ్చరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరువాసులను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. కశ్మీరీలకు సంఘీభావం తెలిపేందుకు, మానవతావాద సహాయం చేసేందుకు నియంత్రణ రేఖను దాటి వెళ్ళవద్దని కోరారు. జమ్మూ-కశ్మీరులోని తోటి కశ్మీరీలు రెండు నెలలకుపైగా అమానుషమైన కర్ఫ్యూలో బతుకుతున్నారని, వారిని చూసి పాకిస్థాన్‌లోని కశ్మీరీలు ఆవేదన చెందుతున్నారని, దానిని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అయితే కశ్మీరీ సంఘర్షణకు మానవతావాద సహాయం కానీ, మద్దతు కానీ ఇవ్వడానికి పాకిస్థాన్‌లోని కశ్మీరీలు ఎవరైనా నియంత్రణ రేఖను దాటి వెళ్ళినట్లయితే, భారత దేశ కథనానికి బలం చేకూరుతుందని, శత్రువు చేతికి చిక్కినట్లవుతుందని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీరులో విధించిన అమానుష కర్ఫ్యూను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరీలకు మద్దతుగా జరుగుతున్నది పవిత్ర యుద్దమని పేర్కొన్నారు. భారత్ స్పందిస్తూ, ఇమ్రాన్ వ్యాఖ్యలు ఆయన నిర్వహిస్తున్న పదవి హుందాతనానికి తగినవి కాదని పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాలను ఏవిధంగా నిర్వహించాలో ఆయనకు తెలియదని పేర్కొంది.