నిరసన రైతుల హక్కు

– చట్టాల అమలు నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించండి

– ఆందోళనలో ఆస్తి, ప్రాణనష్టం జరగొద్దు:సుప్రీం కోర్టు

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి): నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. తొలుత రైతులను ఖాళీ చేయించాలన్న అంశంపైనే విచారిస్తామని, చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. నిరసన తెలియజేయడం రాజ్యాంగ హక్కు అని, అయితే ఆందోళనల వల్ల ఇతరుల ప్రాణాలకు నష్టం కలగకూడదని న్యాయస్థానం సూచించింది. రైతులు తమ ఆందోళన కొనసాగించొచ్చని తెలిపిన ధర్మాసనం.. సమస్య పరిష్కారానికి ఇది సరైన మార్గం కాదని అభిప్రాయపడింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. ‘దిల్లీని నిర్బంధిస్తే ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు. విూ ఉద్దేశాలు నెరవేరాలంటే అవి చర్చలతోనే సాధ్యం. కేవలం ఆందోళనలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు’ అని సీజేఐ జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు మరోసారి తెలిపింది. కేంద్రం, రైతు సంఘాలతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తేనే ప్రతిష్టంభన తొలుగుతుందని అభిప్రాయపడింది. దీనిపై రైతుల స్పందన కూడా వినాలనుకుంటున్నట్లు తెలిపింది.

అలా చేస్తే చర్చలకు వస్తారేమో..

సాగు చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు కేంద్రంతో చర్చలకు ముందుకొస్తారేమోనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. దీనిపై స్పందించిన అటార్నీ జనరల్‌.. చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వంతో చర్చలు జరిపిన అన్ని రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వెకేషన్‌ బెంచ్‌ చేపడుతుందని ధర్మాసనం వెల్లడించింది.