నిరుద్యోగభృతి చెల్లించాలి

అనంతపురం, మే4(జ‌నంసాక్షి): నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగభృతి మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజినేయులు అన్నారు. ఎపిలో ఉద్యోగ నియామకాలుచేయడం లేదన్నారు. దీంతో సీమలో అనేకమంది పెద్దపెద్ద చదువుల చదివినా కొలువులు లేక ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. లేకుంటే భృతి చెల్లించాలన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో కరువు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం తగదని పేర్కొన్నారు. రేషనలైజేషన్‌ పేరుతో జిల్లాలో 992 పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని అన్నారు.  డిఇడి పరీక్షలను వెంటనే నిర్వహించాలని, విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. డిఇడి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వచ్చే డిఎస్సీలో వారిని అనర్హులను చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు.