నిరుద్యోగ సమస్యే ప్రధాన ప్రచారం

తేజస్వీ యాదవ్‌ ముందే గుర్తించి తెలివైన అడుగు
పాట్నా,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): బీహార్‌లో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఇప్పటికే పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. బీహార్‌లో నిరుద్యోగం అనేది బ్రహ్మ రాక్షసి పుండులా తయారైంది. ముఖ్యంగా తక్కువ చదువు ఉన్న వారిలో నిరుద్యోగం మరీ ఎక్కువగా ఉంది. పనుల్లేక వీరంతా అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్‌ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పనే ప్రధాన అజెండాగా
మారింది.బీహార్‌లో రాజకీయం కులాల ప్రాతిపాదికపై నడుస్తుందనేది అందరికీ తెలిసిందే. ఆర్జేడి పార్టీకి ముస్లీమ్‌లు, యాదవుల్లో మంచి పట్టు ఉంది. కానీ ఈ బలం వారికి అధికారాన్ని కట్టబెట్టేందుకు సరిపోవడం లేదు. ఇతర సామాజిక వర్గాల ఓట్లును ఆకర్షించడం కూడా కీలకం. ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానంటూ అన్ని సామాజిక వర్గాల వారినీ ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అన్ని సామాజిక వర్గాల్లోనూ నిరుద్యోగం బాగా పెరిగింది. అందరూ అసహనంతో ఉన్నారు. తమకు ఉపాధిని ఎవరు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఉపాధి,ఉద్యోగాలు,వ్యాపారం కోసంవలసవెళ్లే వారి సంఖ్యలో దేశంలోని అన్ని  రాష్ట్రాల కన్నా బీహార్‌ మొదటిస్థానంలో ఉంది. బీహార్‌ నుంచి వలస కార్మికులు ఎక్కువగా వెళుతుంటారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఈ వలస కార్మికులకు పెద్ద దెబ్బ తలిగింది. గతంలో వలసకార్మికులు పంపించే డబ్బే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 30 శాతం వరకు ఉండేది. కరోనా కారణంగా ఈ ఆదాయానికి గండిపడింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వీరికి ఆదాయాలు లేక, పనులు లేక ప్రభుత్వంవైపు, పార్టీల వైపు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అసలకే ఎక్కువగా నిరుద్యోగానికి అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా వలసకార్మికుల సమస్య తోడైంది.ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్‌జెడి) ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని హావిూనిచ్చారు. మరోవైపు బిజెపి కూడా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో 19 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. బీహార్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో దేశంలోనే నిరుద్యోగిత రేటు బాగా పెరిగితే బీహార్‌లో అయితే జాతీయ సగటు కన్నా ఇంకా అధికంగా ఉంది. దేశ సగటుతో పోలిస్తే బీహర్‌లో నిరుద్యోగం దాదాపు రెండింతలు అధికంగా ఉంది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం బీహార్‌లో మొత్తం ఉపాధి పొందుతున్న వారిలో నెలవారీ జీతాలు తీసుకుంటూ స్థిరమైన వేతనం ఉన్న వారు కేవలం 10 శాతం మంది మాత్రమే.ఈ పరిస్థితిని గమనించే ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ పెరిగిన నిరుద్యోగం ఇప్పుడు ఇక్కడ ప్రచారాస్త్రంగా మారింది.