నిరుపేదలకు బాసటగా నిలుస్తున్న సుల్తాన
సిద్దిపేట బ్యూరో 15, జూన్ ( జనం సాక్షి )
గ్రామం ప్రాంతం అని తేడా లేకుండా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారిని అక్కున చేర్చుకుంటూ తన వంతు సహాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకులు, ఇందు ప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ దంపతులు. బుధవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహమ్మద్ బాబా కుటుంబాన్ని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్న మానవత్వంతో వారికి భరోసా కల్పించాలని లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. మిరుదొడ్డి గ్రామానికి చెందిన మహమ్మద్ బాబా కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉందని బాబా మీద ఆధారపడి మాత్రమే కుటుంబం జీవిస్తున్నారు. అతడు సైకిల్ పంక్చర్ షాప్ నడుపుతు భార్య, పిల్లలు పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగుతున్న వారి జీవన ప్రయాణంలో బాబా అకాల మరణం ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి నా అనే వారు లేకుండా బాబా భార్య, పిల్లలు మిగిలిపోయారు. బాబాకు భార్య జరీనా, కూతుర్లు నేహ,సానియా, సాదియా ముగ్గురు ఆడపిల్లలే ఉండటం బాధాకరం. వారి పోషణ, చదువు,వారి పెళ్లిలు చేయడం తల్లి జరీనాకు తలకు మించిన భారంగా మారిందన్నారు. కాబట్టి మానవతావాదులు దయా హృదయులు మహమ్మద్ బాబా కుటుంబానికి తోచిన సహాయం చేస్తూ సమాజమే అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మండల టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు కుమార్, సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్, స్థానికులు నరసింహారెడ్డి, స్వామి,పాషా,హలీం, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area