నిరుపేదల ఇండ్లకు ఉచితంగా పట్టాలు పంపిణీ చేయాలి – గుంజపడుగులో బిజెపి నాయకుల రాస్తారోకో

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని నిరు పేదల ఇండ్లకు ప్రభుత్వం ఉచితంగా పట్టాలు పంపిణీ చేయాలని, గ్రామాల్లో రెవెన్యూ అధికారుల సిబ్బంది దౌర్జన్యం ఆపాలని, కెసిఆర్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 58, 59 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంథని మండలం గుంజపడుగు గుంజపడుగు చౌరస్తాలో సోమవారం దాదాపు గంటసేపు బిజెపి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, బిజెపి పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ధనం లుటియే ధ్యేయంగా ప్రజలపై అధిక పన్నుల భారం మోపి గ్రామాల లోని ప్రభుత్వ స్థలాల్లో, ఇందిరమ్మ ఇనాం భూములలో గ్రామకంఠం, సీలింగ్ భూములలో కొన్ని శతాబ్దాల పాటు నివాసం ఏర్పరచుకొని సొంత ఇల్లు నిర్మించుకున్న నిరుపేదలపై కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 58,59 జీవో తీసుకువచ్చి 124 గజాలు విస్తీర్ణం ఉంటే ఉచితంగా పట్టా చేస్తామని అంతకంటే ఒక గజం ఎక్కువ ఉన్నా లక్షలల్లో రూపాయలు చెల్లించాలని, లేనియెడల ఇంటి పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని ఇళ్ల స్థలాలు లేని వారికి ఇస్తామని చెప్పి ఒక్కొక్క ఇంటిపై లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు వసూలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతి ఇంటికి డిమాండ్ నోటీసు పంపించడం జరిగిందని ఇది దారుణం అన్నారు. అంతటితో ఆగకుండా గ్రామాలలోకి తహసిల్దారు, రెవెన్యూ సిబ్బంది కలిసి జెసిబి, ట్రాక్టర్లతో సహా గ్రామాల్లోకి చొరబడి పేద ప్రజల ఇండ్ల మీదికి వచ్చి దౌర్జన్యంగా భూములను జప్తు చేస్తామని చెప్పి, మాకు జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఉందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పేద ప్రజల పైన ఆర్థిక భారం మోపే ఈ జీవోలను రద్దుచేసి నిరుపేదల ఇండ్లకు ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా పట్టాలు పంపిణీ చేయాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలి, నాలి చేసుకొని రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో గ్రామీణ ప్రజలు ఉంటే వారు లక్షల రూపాయలు చెల్లించి ఏ విధంగా పట్టాలు చేసుకుంటారని దీన్ని బట్టి చూస్తే కెసిఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్తం పిలుస్తూ నయా నిజాం రజాకార్ల పరిపాలన తరిపిస్తుందని అన్నారు. గ్రామాలలో నివసిస్తున్న నిరుపేదల ఇండ్లకు పంపించిన ఇట్టి డిమాండ్ నోటీసులను రద్దు చేయాలని అధికారుల వేధింపులు, దౌర్జన్యం దాడులు ఆపని పక్షంలో బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి నాయకత్వంలో ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బూడిద రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఆరె ఓదెలు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు చాంద్ పాషా, బూడిద మల్లేష్ ,ఎడ్ల సాగర్, మండల కోశాధికారి ఎలుక సదానందం, తాడూరి రవి, కలువల శంకర్, బూడిద విష్ణు వర్ధన్, దొడ్డిపట్ల శంకర్, గుమ్మడి మల్లయ్య, నల్లి శ్రీనివాస్, ఎరుకల సుమన్ మరియు వివిధ గ్రామాలలోని నిరుపేద బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.