నిర్లక్ష్యానికి బలైన నిండు ప్రాణం..

మురికి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయిన టైల్స్ కార్మికుడు.

సమస్యను వెలుగులోకి తెచ్చిన జనం సాక్షి స్పందించని అధికారులు.

సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). మున్సిపల్, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. ఓ నిరుపేద కుటుంబం పెద్దదిక్కు కోల్పోయి తీరని విషాదంలో మిగిలింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ సిసి రోడ్డు మురికి కాలువ గా మారిన వైనంపై జనం సాక్షి అందించిన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి ఉంటే నిరుపేద కుటుంబం ఇంటికి పెద్ద దిక్కున కోల్పోకుండా ఉండేదని కాలనీవాసులు చెబుతున్నారు. నేతుల దశరథం (45). టైల్స్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య సునీత కూతురు తో కలిసి శాంతినగర్ లో నివాసం ఉంటున్నాను. సోమవారం రాత్రి సమయంలో బయటకు వచ్చిన దశరథం అనూహ్యంగా సిసి రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీళ్లలో అదుపుతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 సమాచారం అందించడంతో చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దశరథం ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు తెలపడంతో నిరుపేద కూలి కుటుంబం ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి నిస్సహాయ స్థితిలో కన్నీటిపర్యంతరం అవుతుంది. అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పలువురు ఇదే ప్రదేశంలో అదుపుతప్పి పడిపోయి గాయాలపాలైన సంఘటనలు చోటు చేసుకున్న విషయం స్థానిక కౌన్సిల్ తో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి నిస్సహాయ స్థితిలో మిగిలిన దశరథం కుటుంబం పరిస్థితి మరి ఎవరికి రాకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.