నిలిచిపోయిన కాళేశ్వరం పనులు
భారీవర్షాలతో పనులకు ఆటంకం
జయశంకర్ భూపాలపల్లి,ఆగస్ట్11(జనం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల కారణంగా కాలేశ్వరం పనులు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. కాటారం, మహాదేవాపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మహాముత్తారం – కాటారం మధ్య లోలెవల్ వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తోంది. ధౌత్‌పల్లి, పోతులవాయి వాగులు పొంగుతున్నాయి. వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. అన్నారం బ్యారేజీ వద్ద కరక్కట్ట నిర్మాణం పనులు నిలిచిపోయాయి. కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాంక్రిట్ పనులు నిలిచిపోయాయి. మందమర్రిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కల్యాణికణి, ఆర్‌కేపీ ఉపరితల గనుల్లో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బైరిగూడలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీరాంపూర్‌లో ఉపరితల గనిలో మట్టి పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షం పడుతోంది. వర్షాల కారణంగా వ్యవసాయ పనులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాయగూడెం వద్ద గోదావరిలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులు నదిలో చిక్కుకుపోయాయి. జాలర్ల సాయంతో యువకులను బయ్యారం పోలీసులు కాపాడారు.