నిలిచిపోయిన రోడ్డు రవాణా

2
రోడ్‌ సేఫ్టీ బిల్లులను వ్యతిరేకంగా ఆందోళన

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి):

రోడ్‌సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి, పలు రాష్టాల్ల్రో రవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాల సంఘం సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ ప్రభావం దేశంలోని పలు రాష్టాల్ల్రో కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రోడ్డు రవాణా భద్రత బిల్లులో చేర్చిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలు రవాణా సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్టాల్ల్రో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఏఐసీసీటీసీ, సీపీఎఫ్‌ తదితర సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టబోతున్న రోడ్డు రవాణా భద్రతా బిల్లును అన్ని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సజావుగా ఉన్న రోడ్డు ట్రాన్స్‌ పోర్ట్‌ సేఫ్టీ బిల్లును మార్చి ఆమోదానికి పెట్టడంపై లారీ ఓనర్లు, డ్రైవర్లు, వాహనదారులందరూ మండిపడుతున్నారు. బిల్లును వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని ట్రేడ్‌ యూనియన్లు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో..అర్ధరాత్రి నుంచే ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కార్మికులు ఇచ్చిన బంద్‌ పిలుపుకు లారీలు, ఆటోలు, ఇతర రవాణావాహనాల యజమానులు మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించింది. రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల బంద్‌ హంసాత్మకంగా మారింది.  దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.  వాహనాల రాకపోకలు స్తంభించడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాణిజ్య రాజధాని ముంబాయిలో బంద్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లారీ, టాక్సీ, ఆటో యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు పలికాయి. దాంతో కార్యాలయాలకు వెళ్లలేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ల సమ్మె పిలుపుతో తిరువనంతపురంలో దుకాణాలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రధాన నగరాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. దేశ వ్యాప్త సమ్మెకు ఆయిల్‌ ట్యాంకర్ల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. కొన్ని రాష్టాల్రు సైతం రోడ్డు రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో బంద్‌ హింసాత్మకంగా మారింది. హౌరాలో వామపక్ష కార్యకర్తలు ప్రభుత్వ వాహనాల అద్దాలు పగులగొట్టారు. మరికొన్ని చోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతాబలగాలు లాఠీచార్జీ చేశాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో ఆర్టీసీ బస్సులు యాధావిధిగా తిరుగుతాయని యాజమాన్యం ప్రకటించడంతో..ఆర్టీసి బస్సులు యధావిధిగా తిరిగాయి. రావాణా రంగ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు అన్ని ట్రేడ్‌ యూనియన్లు మద్దతు తెలిపాయి. హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు ఆటో యూనియన్ల్‌ ర్యాలీ నిర్వహించాయి. లారీలు పూర్తిగా నిలిచిపోయాయి. 20 శాతం ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. ఎంజిబిఎస్‌ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది.రోడ్లపై తీవ్రంగా ట్రాఫిక్‌ జాం అవుతుంది. రోడ్డు సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. కడప నగరంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు వాహనాల బంద్‌ నిర్వహించారు. రోడ్డు రవాణా భద్రత బిల్లుపై డ్రైవర్లందరికి అవగాహన కల్పిస్తూ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడప ఆర్టీసి బస్‌ స్టేషన్‌ వద్ద కార్మిక సంఘాలు బంద్‌ నిర్వహిస్తున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. బిల్లుకు వ్యతరేకంగా రణస్థలం మండలం ఒరిస్సా సరిహద్దు ఇచ్చాపురం వరకూ కార్మికులు బంద్‌ పాటించడంతో లారీలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రవాణా కార్మికులు బంద్‌ నిర్వహించారు. లారీలు, ఆటోలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో..సరుకు రవాణా మొత్తం ఆగిపోయింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆటో డ్రైవర్లు ర్యాలీ చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు నెహ్రూ ల్మక్‌లో మానవహారం చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. రెద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న రోడ్డు రవాణా బిల్లును వ్యతిరేకిస్తూ ఆటో యూనియన్‌ నాయకులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వీరంతా నక్కపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని ఉపతహసీల్దార్‌ లక్ష్మికి ఈ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అప్పలరాజు, వెంకటస్వామి, ఆటోయూనియన్‌ నాయకులు మధు, తాతాబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో స్వచ్ఛందంగా ఆటోలను బంద్‌ చేశారు. సమ్మె కారణంగా నగరంలోని 25 వేల ఆటోలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు నిలిచిపోయాయి. సమ్మెకు లారీ ఓనర్స్‌ అసోసియన్‌ మద్దతు తెలిపింది. రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు.విజయవాడలో జాతీయరహదారిపై అన్ని వాహనాలను నిలిపి వేశారు. ఎపి, కృష్ణా లారీ ఓనర్స్‌ ఆందోళన చేపట్టారు. సాధ్య పడే జరిమానాలు వేయాలి…. కానీ తలకు మించిన జరిమానా వేయరాదు. రోడ్లను అభివృద్ధి చేయాలి. టోల్‌ గేట్ల పేరుతో యుపిఎ, ఎన్‌ డిఎ ప్రభుత్వాలు డబ్బులు దండుకుంటున్నాయి. ఎపిలో ఎక్కడ కూడా డ్రైవింగ్‌ స్కూల్‌ లేదు. రోడ్ల వెంబడి.. బెల్లు షాపులు, మద్యం షాపులు వెలిసాయి. వాటిని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తిరుపతిలో సమ్మె కారణంగా నగరంలో 13వేల ఆటోలు నిలిచిపోయాయి. బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. బిల్లు వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ధ్వంసం అవుతుంది. భారత రవాణా రంగాన్ని విదేశీయులకు అప్పజెప్పాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం భద్రత పేరుతో నూతన చట్టం తీసుకొస్తుంది. మార్పు చేసిన చట్టంలో విపరీతంగా జరిమానాలు వేసే పద్ధతి ఉంది. రోడ్లను అభివృద్ధి చేయలేదు. జరిమానా విధించినంత మాత్రానా ప్రమాదాలు తగ్గవన్నారు. మొత్తంగా లారీలు, ఆటోలు నిలిచిపోయాయి. రవాణా స్థంబించింది. వివిధ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి.