నిష్కామ కర్మయోగి వాజ్‌పేయ్‌

మహాభారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది….ఇందులో లేనిదేదీ ప్రపంచంలో ఉండదని వ్యాస భగవానుడు మహాభారతంలో చెబుతాడు. ఇది మహాభారతం గొప్పతనం. అందుకే వ్యాసుడి భాగవతం నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అందులో ఇమిడివున్న పాత్రలు..సందర్బాలు..ఎత్తులు పై ఎత్తులు, రాజకీయాలు అలాంటివి. మహాభారతంలో భీష్మాచార్యుడి పాత్ర మన దివంగత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌కు సరిగ్గా సరిపోతుంది. భారతంలో తండ్రిద్వారా సంక్రమించిన రాజ్యాన్ని, అధికారాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహానుభావుడు భీష్మాచార్యుడు. అంతేగాకుండా అధికారం అక్కర్లేకుండా స్థితప్రజ్ఞతతో జీవితాంతం గడిపిన మహానుభావుడాయన. ఎన్నో ఉదాత్త లక్షణాలు కేవలం భీష్మాచార్యుడికే సొంతం. అలాంటి సందర్భమే ఇప్పుడు వాజ్‌పేయ్‌ విషయంలోనూ చూడవచ్చు. భారతంలో భీష్ముడు అధికారానికి దూరంగా ఉంటే..ఆధునిక భారతంలో అధికారం ఉన్నా స్థితప్రజ్ఞతతో ఉన్న ఏకైక వ్యక్తి వాజ్‌పేయి. అధికారంలో ఉండగా స్థితప్రజ్ఞుడిగా ఉండడం అన్నది అరుదైన ఘట్టంగానే చూడాలి. కారణజన్ములకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అధికారం ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటూ ఆజాత శత్రువుగా నిలిచిపోవడం అన్నది అన్నింటికన్నా అరుదైన వ్యక్తిత్వం మాత్రమే. వ్యాసభగవానుడు చెప్పినట్లుగానే కలియుగంలో ఇలాంటి వ్యక్తులు తారసపడడం అరుదుగా మాత్రమే చూస్తాం. అంతటి మహానుభావుడు వాజ్‌పేయ్‌ మన కళ్లెదుట ఉండి మనకు అలాంటి అనుభవాలను పంచి పోవడం భారత ప్రజలు చేసుకున్న అదృష్టం. భారత రాజకీయాల్లో దేశాన్ని కాంగ్రెస్‌ మాత్రమే పాలించగలదు. అది మాత్రమే పార్టీ..బిజెపి అంటరానిదన్న తీరుగా ముద్రవేసిన రోజుల్లో బిజెపిని ఓ సమున్నత శిఖారలకు తీసుకుని వెళ్లి..ప్రజలకు ఏదైనా మంచి చేస్తే బిజెపి మాత్రమే చేయగలదన్న ఇమేజ్‌ను సృష్టించిన వారిలో వాజ్‌పేయ్‌ అగ్రగణ్యుడు. అందుకే ఉదారవాది, సార్వజనీన ఆమోదం పొందిన రాజనీతిజ్ఞుడు అటల్‌ బిహారీ వాజపేయి మరణం భారత రాజకీయరంగానికి తీరని లోటు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ వంవపారంపర్య పాలనకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించి భారత రాజకీయాలను పరిపుష్టం చేసిన అరుదైన వ్యక్తిత్వం వాజ్‌పేయ్‌ది. విపక్షాలు కూడా వినమ్రంగా ఆయనను గౌవించి వందనం చేయగలిగిన మ¬న్నతుడు మన వాజ్‌పేయ్‌. భారతీయ సమాజాన్ని, భారత రాజకీయాలను ఆయనంతగా మరెవరూ అర్థం చేసుకొని ఉండరు. పార్లమెంట్‌లో ఆయన చతుర సంభాషణలు ప్రత్యర్థులను కూడా కట్టిపడేసేవి. ఆయన ఏం మాట్లాడుతారో వినాలని ఎదురు చూసేవారు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారపక్షాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకోలేదు. సకారాత్మక విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానిగా ప్రతిపక్ష నాయకుల ఆదరణ పొందారు. దేశ ప్రధానిగా అందరివాడు అనిపించుకున్నారే తప్ప, ఒక వర్గానికో సంస్థకో ఆయన ఆలోచనలు పరిమితం కాలేదు. రాజకీయమంటే స్వార్థం అన్న ఈ కాలంలో ..రాజకీయమంటే దేశహితం అన్న భావనను వ్యాప్తి చేసి ఆచరించిన మహాజ్ఞాని మన వాజ్‌పేయ్‌. రాజకీయాల్ని ప్రజాహితంగా భావించి దశాబ్దాల పాటు ప్రజాసేవలో అవిరళ కృషి చేసిన మ¬న్నతుడుగా ఆయన చరిత్రపుటల్లో నిలిచిపోతారు. పుష్కర కాలం క్రితమే సహస్రచంద్ర దర్శనాన్ని పూర్తిచేసుకొన్న పూర్ణ పురుషుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌. వాజ్‌పేయ్‌ అంటే ఓ సుందర రూపం..ఓ భావుకత మూర్తీభవించిన విగ్రహం, సంక్షుభిత స్థితిలోనూ సడలని నిగ్రహం ఆయనకే సొంతం. మృత్యువుకైనా వెరవనంటూనే.. ఎదురుగా వచ్చి పోరాడు అంటూ స్వాగతించిన ధీశాలి. అటల్‌జీ విఖ్యాతనాయకుడు… విశిష్ట రాజకీయవేత్త… స్వార్థమెరుగని సంఘ సేవకుడు… మహావక్త, సాహితీమూర్తి ..ఇలా ఎన్ని విశేషణాలు చేర్చినా తక్కువే.స్వాతంత్య్రానంతర రాజకీయాలలో వాజపేయి ముద్ర చెరిగిపోనిది. కాంగ్రెసేతర పక్షం నుంచి ప్రధానిగా ఐదేండ్లు పాలించిన ఘనత వాజపేయిది. అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించని అరుదైన నాయకుడాయన. అధికారంలో ఉండగా అనైతిక పద్ధతులను దరిచేరనీయకుండా చూసుకున్న మహామనిషి. ఒకసారి అధికారం వస్తే మరో ఐదేళ్లు దీనిని ఎలా కాపాడుకోవాలనుకుని రాజకీయాలు నడిపే వారికి వాజ్‌పేయ్‌ ఆదర్శాలు నచ్చవు. అందుకే ఆయన పదవిలో ఉండగా మరో ఐదేళ్ల అధికారం కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. అందుకోసం కార్యాచరణా చేసుకోలేదు. ఉన్నంత కాలం ప్రజలకు ఏమైనా మంచి చేయగలమా అన్నదే ఆయన ఆలోచన. అందుకే ఆరుదశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో కార్యరూపం దాల్చని ఎన్నో పనులు వాజ్‌పేయ్‌ హాయంలో కార్యాచరణకు వచ్చాయి. స్వర్ణచతుర్భుజి లాంటి కార్యక్రమంతో దేశాన్ని రోడ్డు కనెక్టివిటీ కిందకు తీసుకుని వచ్చిన ఘనత వాజ్‌పేయ్‌ది. పార్టీకి దేశానికి ఏది మంచిది అనే లక్ష్మణరేఖను ఎవరికి వారు గౌరవించి, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే, దీర్ఘకాలం బంధాలు నిలబడతాయని అంటూ లాల్‌కృష్ణ అడ్వాణీతో తన దశాబ్దాల సాన్నిహిత్య రహస్యాన్ని వాజ్‌పేయీ వెల్లడించారు. అందుకే భారతంలో భీష్ముడు, ధర్మరాజుల కలబోతగా వాజ్‌పేయ్‌ జన్మించారు. వారిద్దరి అంశలు ఆయనలో ఉన్నాయి. రాజకీయ పితామహుడు భీష్మాచార్యుడితో పాటు, ధర్మరాజుకున్న ఆజాతశతృవన్న కీర్తిని కూడా వాజ్‌పేయ్‌ పొందారు. అరుదైన ఓ మహాయోగి వాజ్‌పేయ్‌. ఆయన మరణం భారత రాజకీయాలకు..అభివృద్దిని కోరుకునే వారికి వెలితిగానే ఉంటుంది. ఆయన ఓ కర్మయోగి..ఆయన ఓ నిష్కామి. ఆయన పుట్టుక భారత రాజకీయాలను ప్రభావితం చేసిన సందర్బంగానే చూడాలి. నేటితరం నేతలు కొంతయినా ఆయన ఆచరణను పాటిస్తే మంచిది.

—————-