నీటిపారుదల శాఖ కీలక ఒప్పందాలు
హైదరాబాద్,ఫిబ్రవరి 4(జనంసాక్షి):దేశంలోని ప్రసిద్ధ సంస్థలైన బిట్స్, ఐఐటి, నాబార్డ్ లతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు మూడు సంస్థలు ఇరిగేషన్ శాఖకు సాంకేతిక సహకారం అందించనున్నాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషి, ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ దేశాయి, బిట్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.ఎస్. రావు, నాబార్డ్ డైరెక్టర్ సీవీవీ సత్యనారాయణ ఎంఓయులపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఇరిగేషన్ శాఖ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ మూడు సంస్థలతో ఒప్పందాలు చేసుకొని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దీని ఫలితం రానున్న రోజుల్లో కనబడుతుందని చెప్పారు. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. ఐఐటీ, బిట్స్, నాబార్డ్ లాంటి సంస్ధల సహకారం తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ ముందుకు సాగుతోందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ క్రమంలో థర్డ్ పార్టీ చెక్ అవసరం అని భావిస్తున్నామని, ఎక్కడా లోటు పాట్లు ఉన్నా సరిచేసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. ఈ మూడు సంస్థల నుండి అలాంటి సహకారం ఇకముందు నుంచి ఉంటుందని తెలిపారు.
నాబార్డ్ కు అనుబంధంగా పనిచేస్తున్న వ్యాప్కోస్ సంస్ధ రాష్ట్రంలోని వివిధ జిల్లాలను ఎంచుకొని మిషన్ కాకతీయ ఫలితాలను విశ్లేషిస్తుందని హరీష్ రావు చెప్పారు. ఐఐటీ, బిట్స్ లు పైలట్ ప్రాజెక్టులను ఎంచుకొని ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పనులపై వారి విద్యార్థులు, అధ్యాపకులతో అధ్యయనం చేయించాలని వారికి సూచించారు. పీహెచ్.డి, ఎం.టెక్ చేస్తున్న విద్యార్థులకు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పనిపై ప్రత్యేకమైన అసైన్ మెంట్లను రూపొందించాలని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాంక్ సమావేశంలో నాగార్జున సాగర్ ఆధునీకరణ పనుల విషయంలో, ప్రాజెక్టుల పని తీరు, పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా మానిటరింగ్ చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించిన సంగతిని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తున్న కొత్త పుంతలను ఇరిగేషన్ శాఖకు బిట్స్, ఐఐటీ సంస్థలు ఎప్పటికప్పుడు తెలియచేయాలని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా కోరారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లకు ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహించడంలో ఈ సంస్థలు పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్రమైన నాలెడ్జ్ డాటాబేస్ ను రూపొందించడంలో పూర్తిస్థాయిలో సహకరించాలని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో పారదర్శకత పెంచడంలో భాగంగా వెబ్ సైట్ సేవలను మరింత ఆధునీకరించడానికి, విస్తృతపరచడానికి సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ సందర్భంగా ఐఐటీ (హైదరాబాద్) డైరెక్టర్ దేశాయి, బిట్స్ (హైదరాబాద్) డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రావు, నాబార్డ్ డైరెక్టర్ సీవీవీ సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి రంగంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమంలో తమ సంస్ధలు పాల్గొనడం సంతోషించాల్సిన సందర్భం అన్నారు. మూడు సంస్థలతో ఒకేరోజు ఒప్పందాలు కుదుర్చుకోవడం చరిత్ర అని అన్నారు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె. జోషి. వారి సేవలను సమర్ధవంతంగా వాడుకుంటామని చెప్పారు.
మిషన్ కాకతీయ పెండింగ్ పనులు సత్వరం పూర్తి: హరీష్ రావు
‘మిషన్ కాకతీయ’ పనుల నిమిత్తం ఖర్చు చేయాల్సిన బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ అంశంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం సక్రమంగా జరగాలన్నారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. రెండో విడతలో అనుమతి లభించిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని మంత్రి హరీష్ అధికారులను ఆదేశించారు. మిషన్‌కాకతీయ ఫేజ్-1లోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫేజ్-2లో అనుమతి లభించిన పనులకు టెండర్లు పిలవాలన్నారు. గుత్తేదారులపై ఉదాసీనత ప్రదర్శించవద్దని, ఫేజ్-1లో పనులు ప్రారంభించని వారిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇకపోతే మిషన్ భగీరథ పథకానికి నాబార్డు నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.1976.80కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లాలోని 4 సెగ్మెంట్ల పనులకు వినియోగించనున్నారు. జలమండలి- గజ్వేల్ ప్రాజెక్టు, సింగూర్-గజ్వేల్-నర్సాపూర్, సింగూరు- నారాయణఖేడ్- ఆందోల్-మెదక్, సింగూరు-సంగారెడ్డి సెగ్మెంట్లకు రుణం పొందేందుకు అనుమతిలభించింది. తెలంగాణ సాగునీటి సరఫరా సంస్థ ఎండీకి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.