నీటిలో మునగడం వల్లే చనిపోయాడు..

దిల్లీ: రెండు రోజుల కిందట దిల్లీలో ఓ ప్రైవేటు పాఠశాలలోని నీటితొట్టిలో పడి మృతి చెందిన ఆరేళ్ల బాలుడుదివ్యాన్ష్‌ మృతికి కారణాలు తెలిశాయి. నీటిలో మునగడం వల్లే బాలుడు మృతి చెందాడని శవపరీక్ష నివేదికలో తేలింది.వివరాల్లోకి వెళితే…వసంత్‌కుంజ్‌ ప్రాంతంలోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివే ఆరేళ్ల బాలుడు దివ్యాన్ష్‌ శనివారం మధ్యాహ్నం తరగతి గది నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో ఉపాధ్యాయులు వెతకగా పాఠశాలలోని నీటితొట్టిలో స్పృహ తప్పి కనిపించాడు. వెంటనే స్కూల్‌ సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే.. నీటిలో మునగడం వల్లే బాలుడు మృతి చెందాడని పోస్టుమార్టం ద్వారా వెల్లడైంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమారుడు 20కిలోల బరువు ఉన్న నీటితొట్టి మూతను ఎలా తొలగించాడో చెప్పాలంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. కేసును కావాలనే తప్పుదోవ పట్టించాలని పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.