నీట్‌ ఆందోళనలను కంట్రోల్‌ చేయండి

తమిళనాడుకు సుప్రీం సూచన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నీట్‌ పరీక్ష అంశంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్‌ ఆదేశించింది. రాష్ట్రంలో పౌరుల సాధారణ జీవితానికి భంగం వాటిల్లే కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై చట్టబద్ధ చర్యలుంటాయని స్పష్టం చేసింది. నీట్‌ పక్రియను ఇప్పటికే సర్వోన్నత న్యాయస్ధానం సమర్ధించిందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు పేర్కొంది. నీట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలూ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్‌ కార్యదర్శిలను ఆదేశించింది. నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఈ నోటీసులు జారీ చేసింది.

నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలతో సాధారణ జనజీవనం

ప్రభావితమవుతోందని పిటిషనర్‌ కోర్టుకు నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.