నీట మునిగిన ఈశాన్య భారతం

– సహాయం కోసం ఎదురుచూపులు

పాట్నా,ఆగష్టు 18(జనంసాక్షి):తూర్పు, ఈశాన్య రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా అస్సోం, బీహార్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 200 మంది చనిపోయారని అంచనా. దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు , ఈశాన్య రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. బీహార్‌, అస్సోం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరదల కారణంగా బీహార్‌లో 98 మంది, అస్సోంలో 100 మందికి పైగా చనిపోయారు. 22లక్షల మందికిపైగా నిరాశ్రయులు కాగా, వేల సంఖ్యలో జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన బ్రహ్మపుత్రా నది అతి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఊళ్లన్నింటినీ ముచ్చేస్తోంది. నదిలోకి ఇంకా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇప్పట్లో వరద ఉధృతి తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు బీహార్‌లో 15 జిల్లాలకు చెందిన 93లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బీహార్‌ వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం నితీష్‌ కుమార్‌ సవిూక్షించారు. ప్రజలకు చికిత్స అందించేందుకు 104 ఉచిత టోల్‌ఫ్రీ నెంబర్‌ను వైద్యశాఖ అధికారులు ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. 2.13లక్షల మంది 504 సహాయ శిబిరాల్లో ఉంటున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 70 మంది ఆర్మీ, 114 ఎన్డీఆర్‌ఎఫ్‌, 92 ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని ఈశాన్య రైల్వే పేర్కొంది. రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో 39 రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ప్రకటించారు. వరదల కారణంగా జాతీయ రహదారులతో సహా 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు పశ్చిమ బెంగాల్‌ అస్తవ్యస్తంగా మారింది. ఆరు జిల్లాల్లో మొత్తం 14లక్షల మంది వర్షాలు, వరదలకు ఇబ్బంది పడుతున్నారు.