నీతి ఆయోగ్‌ విసిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ‘నీతి ఆయోగ్‌’ వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగిన అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన రాజీవ్‌.. పాలసీ రీసెర్చ్‌ సెంటర్‌లో సీనియర్‌ సభ్యులు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో డీఫిల్‌ పూర్తిచేసిన రాజీవ్‌.. లక్నో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. అంతకుముందు ఫిక్కీలో జనరల్‌ సెక్రటరీగా వ్యవహరిం చారు. 2006 నుంచి 2008 వరకు జాతీయ భద్రతా సలహా బోర్డులో సభ్యుడిగా కొనసాగారు. అంతేగాక ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ మినిస్టీ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థికశాఖలో ఉన్నత పదవుల్లో పనిచేశారు. ఆగస్టు 1న నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి అరవింద్‌ పనగడియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొలంబియా విశ్వవిద్యాలయం తన సెలవు పొడిగింపునకు అంగీకరించలేదని.. అందుకే ఆగస్టు 31వ తేదీకల్లా నీతి ఆయోగ్‌ విధుల నుంచి వైదొలిగేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పనగడియా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు ప్రధాని అంగీకారం తెలపడంతో గురువారం ఆయన ఉపాధ్యక్షుడి పదవి నుంచి వైదొలిగారు. దీంతో నేడు రాజీవ్‌ ఆ బాధ్యతలు చేపట్టారు.