నీలం తుఫాను ప్రాథమిక నష్టం అంచనా రూ.1710 కోట్లు

పూర్తి నివేదిక అందిన వెంటనే కేంద్రానికి పంపుతాం

ఆర్థిక మంత్రి ఆనం రామనారయణ రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌21: ఇటీవల రాష్ట్రంలో సంభవించిన నీలం తుఫాను వల్ల 1710 కోట్లు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో విూడియాతో మాట్లాడుతూ దీనిలో 608 కోట్లు వరి, పత్తి పంటలు కాగా, 102 కోట్లు ఉద్యానవనాలని చెప్పారు. పూర్తి స్థాయి నష్టాన్ని సిబ్బంది అంచనా వేస్తున్నారని రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని నివేదిక రాగానే కేంద్రానికి పంపిస్తామన్నారు. ఈనెల 20న బెంగుళూరులో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి నీలం తుఫాను వల్ల రాష్ట్రం భారీగా నష్టపోయిందని తాత్కాలిక సహాయం క్రింద 1550 కోట్లు అందించాలని కోరినట్లు చెప్పారు. 2009 నుండి ఇప్పటివరకు తుఫానులు, ప్రకటితి వైపరిత్యాలు, వరదలు , కరువులపై రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని 2400 కోట్లు నష్టపరిహారాన్ని కోరగా కేవలం 885 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఇది అడిగిన దాంట్లో 35శాతమన్నారు. మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2009 నుండి 2011 వరకు 3368కోట్లు తుఫాను , వరద బాధితులకు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. నష్టాన్ని అంచనావేయడానికి కేంద్ర బృందాలను పంపిచాలని కోరినట్లు చెప్పారు. రైతులపై వడ్డి  భారం పడకుండా రుణాలు రిషెడ్యూల్‌ చేయాలని కోరినట్లు చెప్పారు. గతంలో మాదిరిగా రుణాలు రీషెడ్యూల్‌ చేస్తే రైతులు 14శాతం వడ్డీ బ్యాంకుల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులపై భారం పడకూడదన్న ప్రభుత్వం కోరక అన్నారు. నీలం తుఫాను సంభవించి నప్పుడు తక్షణ సహాయక చర్యలకై ట్రెజరీ నుండి టి.ఆర్‌27 క్రింద అవసరమైన నిధులు డ్రా చేసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని వారు ట్రెజరీ నుండి 4,25075 వేలు డ్రా చేసుకున్నట్లు చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం, అనంతపూర్‌, కర్నూలు జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని అయితే వారికి ఎంత ఇచ్చినా తక్కువే నన్నారు. గతంలో 4వేలు, 6వేలు ఇచ్చారని అయితే ఎంత మేరకు నష్టం జరిగిందో దానిని పరిశీలించి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. గతంలో జరిగిన తుఫానులకు సంబంధించి 1800 కోట్లు బకాయి ఉన్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. 1800 కోట్లు ప్రభుత్వం రిలీజ్‌ చేసిందని దానిలో 1550 కోట్లు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగతా 2. 5 కోట్లు డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌  లో వారి వద్ద ఉన్నాయని నష్టపరిహారం అందని లబ్దిదారులు ఎవరైనా ఉంటె వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.