నీలేకన్‌ రాకతో ఇన్ఫీ షేర్లకు బూస్ట్‌

ముంబయి,ఆగస్ట్‌28 : సిక్కా రాజీనామాతో ఢమాల్‌ అయిన ఇన్ఫీ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని బాధ్యతలు చేపట్టడంతో ఆ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టాయి. దీంతో మళ్లీ కంపెనీకి మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేర్లు 3శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో రూ.947 వద్ద ప్రారంభమైన షేరు విలువ ఒకానొక దశలో రూ.953.50 గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం రూ. 943 వద్ద కొనసాగుతోంది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈలోనూ ఇన్ఫీ షేర్లు 3శాతానికి పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌ సీఈవో పదవికి విశాల్‌ సిక్కా అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఇటీవల కంపెనీ షేర్లు భారీగా కుదేలైన విషయం తెలిసిందే. రెండు రోజుల్లోనే 15శాతం దాకా నష్టాలను చవిచూశాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.35వేల కోట్లకు పైగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పునరాగమనం చేశారు. ఇన్ఫీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో మదుపర్లు కంపెనీ షేర్ల వైపు మొగ్గుచూపడంతో సోమవారం లాభాల బాట పట్టాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు నేడు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

ఐటీ, ఫార్మా రంగాల షేర్ల అండతోలాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 9,900 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 31,756 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 9,909 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.