నూతన పారిశ్రామిక విధానం వేగవంతం

2

– 17 కంపెనీలకు అనుమతి

– నేడు పత్రాలు అందజేయనున్న  సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ ఐపాస్‌)  వేగవంతంఅయింది. విధాన ప్రకటన రోజు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగానే పరిశ్రమలకు అధికారులు వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు చేసుకున్న దరఖాస్తులకు అధికారులు పది రోజుల్లోనే అనుమతులు సిద్ధం చేశారు.మొదటి విడతగా అనుమతి పొందిన 17 కంపెనీలకు సీఎం కేసీఆర్‌ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో అనుమతి పత్రాలు అందజేయనున్నారు. ఈ 17 కంపెనీలు దాదాపు రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. నాలుగు వేల మందికి పైగా ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతారు.పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు రెండు వారాల్లోగానే అనుమతులు ఇస్తామని ఈ నెల 12న టీఎస్‌ ఐపాస్‌ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కాగా అధికారులు మాత్రం పది రోజుల్లోనే అనుమతులు పూర్తి చేశారు. మొదటి విడత అనుమతి పత్రాలు అందుకునే కంపెనీల్లో ఐటీసీ సహా పలు ప్రఖ్యాత కంపెనీలున్నాయి.