నూతన వసతి గృహాలు నిర్మించాలి
– సచివాలయం ముట్టడికి..
విద్యార్థుల యత్నం
– అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, జులై25(జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోషియేషన్ తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హాస్టళ్ల నిర్మాణం చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ప్రధానంగా ఆర్ అండ్ బీ అధికారులు కాంట్రాక్టర్లను కమిషన్లు డిమాండ్ చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపణలు చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని… హాస్టళ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ..అన్ని రకాల వసతులు కల్పించి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులు రహదారిపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.