నెత్తుటి బాకీ తీర్చుకుంటాం

5

– తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ భూటకం

– మంచినీటి కోసం వెళ్లిన శృతి,సాగర్‌లను పట్టుకుని కాల్చి చంపారు

– టీఆర్‌ఎస్‌ మంత్రులు నాయకులదే బాధ్యత

– కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్‌ హెచ్చరిక

హన్మకొండ/వరంగల్‌ ,సెప్టెంబర్‌21(జనంసాక్షి):

శృతి, విద్యాసాగర్‌ల నెత్తుటి బాకీ తీర్చుకుంటామని సిపిఐ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్‌  ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ నాయకులను వదిలిపెట్టమని ఖమ్మం, కరీంగనర్‌, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి దామోదర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు పత్రిక కార్యాలయాలకు దామోదర్‌ లేఖను పంపారు.

తాడ్వాయి అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ముమ్మాటికీ బూటకమేనని పేర్కొన్నారు. మంచినీళ్ల కోసం దళాన్ని వీడిని శృతి ఆలియాస్‌ మహిత, విద్యాసాగర్‌రెడ్డి ఆలియాస్‌ సాగర్‌లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని దామోదర్‌ పేర్కొన్నారు. కాల్పులు జరిగినట్లు పేర్కొనడం బూటకం అన్నారు. ఎప్పకైనా వారి మృతికి కారకులైన వారికి ప్రజల చేతుల్లో శిక్షతప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చిన శృతి, విద్యాసాగర్‌రెడ్డిలకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.

ఇదేనా నక్సల్స్‌ ఎజేండా…

అధికారంలోకి వస్తే నక్సలైట్ల ఎజెండా అమలు చేస్తానన్న కేసిఆర్‌ నక్సల్స్‌ నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్‌కౌంటర్‌ల పేరుతో పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు పారిస్తున్నాడన్నారు.  అధికార పార్టీ నేతలు ఎన్‌కౌంటర్‌ దురదృష్టకరం అంటూ అడవుల్లో గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ దళాలను తిప్పుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండించాలని దామోదర్‌ విజ్ఞప్తి చేశారు.టిఆర్‌ఎన్‌ మంత్రులను, నాయకులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. త్వరలోనే ప్రజల చేతుల్లో శిక్ష తప్పదన్నారు. అదే విధంగా ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసు అధికారులను సైతం విడిచిపెట్టమన్నారు.

ఇటీవల వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట మండలంలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో టిఆర్‌ఎస్‌ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఎన్‌కౌంటర్‌ బూటకమని ఇప్పటికే పౌరహక్కుల సంఘాలు, పలు ప్రజా సంఘాలు ఆరోపించడంతో పాటు సిపిఐ మావోయిస్టు  కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి దామోదర్‌ తాగునీటి కోసం దళాన్ని వీడిన తమ సభ్యులను  పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ నాయకులు గ్రామాలను వదిలి భయంతో పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా మావోయిస్టులు ప్రతికార చర్యలకు పాల్పడవచ్చుననే పోలీస్‌ ఇంటలిజెన్‌ వర్గాల సమాచారం మేరకు టిఆర్‌ఎస్‌ నాయకుల్లో ఆందోళన పెరిగింది.  గ్రామస్థాయిల్లో ప్రజాప్రతినిధులు మొదలుకుని, మండల, జిల్లా స్థాయి నాయకులు ప్రస్తుతం పట్టణాలలో నివాసం ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట, కొత్తగూడ నర్సంపేట, పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన నాయకులు పట్టణ బాటపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్‌కౌంటర్‌ వరంగల్‌ జిల్లాలోనే జరుగడంతో  జిల్లాలోని అధికార పార్టీ నేతల గుండెల్లో రైలు పరుగెడుతున్నది.