నెరవేరని సొంతింటి కల

పెద్దనోట్ల రద్దు, కరోనాతో కుదేలు

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్లలో పారదర్శకత ఉంటుందని, సామాన్యలకు ధరలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అప్పట్లో ఊదరగొట్టింది. పెద్దనోట్ల రద్దు తరవాత

పరిణామాలు, జిఎస్టీ కారణంగా రియల్‌ రంగం పేదలు, సామాన్యలకు అందనంతగా పెరిగిపోయింది. సొంతింటి కల నిజం కాదని తేలిపోయింది. ఇటీవల కరోనాతో మరోమారు ఆర్థిక రంగం చిన్నాభిన్నం కావడంతో గృహనిర్మాణ రంగం వ్యయం విపరీతంగా పెరిగింది. దీంతో సామాన్యులకు సొంతిల్లు సమకూర్చుకోవాలన్న కల నెరవేరడం లేదు. రియల్‌ రంగంలో విపరీతమైన పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు శరాఘాతంగా మారింది. ఏదైనా ఫ్లాట్‌ లేదా ఇల్లు కొనుగోలు చేసేవారు పూర్తి మొత్తానికి లెక్కలు చూపడమన్నది జరగడంలేదు. ప్రభుత్వ విలువ ప్రకారం బ్యాంకు ద్వారా కొంత చెల్లించి, అనధికారికంగా మిగతా మొత్తాన్ని నగదుగా తీసుకోవటం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే. ఆస్తుల క్రయ విక్రయాల్లో, అధిక విలువ కొనుగోళ్లలో, ఆభరణాల కొనుగోళ్లలో ఇప్పటి వరకూ నగదు చెలామణి ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో నగదు పాత్ర తగ్గిపోతుందని, బ్యాంకుల ద్వారానే అధికారికంగా చెల్లించే మొత్తం పెరుగు తుందని ప్రభుత్వం భావించింది. ఇలాంటి లావాదేవీల వలన చాలావరకు బ్లాక్‌మనీ చెలామణి అవుతోంది. ఎప్పటికీ ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉండిపోతోంది. దీనిపై ప్రభుత్వానికి పన్ను ఆదాయం లేకపోగా, ఎప్పటికీ ఇది నల్లధనం చెలామణికి ఒక మార్గంగా నిలిచిపోయింది. అయితే పైసాపైసా కూడబెట్టుకున్న వారు కొంత నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీనికి లెక్కలు ఎలా చూపుతారన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వినియోగదారులకు రక్షణ చర్యలు అవసరం. అలాగే రిజస్టేష్రన్లు, జిఎస్టీ తదితరాలు తడిసి మోపెడు అవుతున్న దశలో వాటిని ఎలా నిరోధిస్తారన్న దానికి సమాధానం లేదు. ఆభరణాల వ్యాపారం లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఈ పరిణామం ఈ రెండు వ్యాపార రంగాలకు కొంత నష్టం చేసే అవకాశం ఉన్నా ఆర్థికంగా దేశానికి మంచిదని నిపుణులు చెబుతున్నా అలాంటి అవకాశాలు రాలేదు. రియల్‌ రంగంలో జిఎస్టీ వస్తే ఇక గృహాల కొనుగోలు మరింత భారం కానుంది. ఇప్పటికే పెరిగిన ధరలు సొంతింటి ఆశలపై నీళ్లు చల్లాయి. దీనికితోడు కరోనా కారణంగా అన్ని రంగాల్లో ధరలు మోత మోగిస్తున్నాయి. రియల్‌ ధరలు దిగివస్తాయని భావించిన వారికి నిరాశే ఎదురయ్యింది.