నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. నిన్న ఒక్కరోజే 1,301 నామినేషన్లు దాఖలయ్యాయి. శుభముహూర్తం… సప్తమి కలిసిరావడంతో ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులంతా మంది మార్బలంతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ చివరి రోజు కావడం వల్ల కోలాహలం పెరగనుంది. జోనల్ వారీగా జీహెచ్‌ఎంసీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది.
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం….
గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ రెండు విడతల్లో 80 మంది అభ్యర్ధులను, కాంగ్రెస్ 45 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. అన్ని డివిజన్లలో అభ్యర్ధులందరూ భారీ ఊరేగింపుతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీట్లు దక్కని అభ్యర్ధులు సైతం ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్దులు సైతం….
కాంగ్రెస్ అభ్యర్దులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు భారీ ఊరేగింపులతో నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో గెలిచిన అభ్యర్ధులే పోటీకి దిగుతుండడంతో.. తమ బలగాలతో వచ్చి నామినేషన్లు వేశారు. ఇక టీడీపీ-బీజేపీ పొత్తుతో సీటు రాదని ముందే తెలిసిన ఆశావహులు.. టీడీపీ, బీజేపీల నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ఇదిలావుంటే.. ఎన్నోఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా.. సీటు దక్కని అభ్యర్ధులు.. రెబల్స్‌గా రంగంలోకి దిగి పోటీకి సై అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించడంతో.. ఇక హంగామా అంతా వారి భర్తలదే నడుస్తోంది. ఇక సీట్లు రాని వారు బంధువర్గం తరపున నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటివరకు మొత్తం నామినేషన్లు 1097 నమోదు…
ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 1097కు చేరింది. ఇందులో టీఆర్‌ఎస్-277, కాంగ్రెస్-200, టీడీపీ-181, బీజేపీ-93, ఎంఐఎం-27, సీపీఐ-14, లోక్‌సత్తా-12, సీపీఎం-8, స్వతంత్ర అభ్యర్ధులు 249 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గ్రేటర్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. ఎట్టకేలకు గ్రేటర్‌లో ఓటర్ల లెక్కతేలింది. మొత్తం 74 లక్షల 23 వేల 980 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 39 లక్షల 69 వేల ఏడు మంది పురుషులు,.. 34 లక్షల 53 వేల 910 మంది మహిళా ఓటర్లు.. ఒక వెయ్యి 63 మంది ఇతరులు ఉన్నారు. ఇక నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరిరోజు కావడంతో నామినేషన్ల పర్వం భారీగా కొనసాగనుంది. ఆదివారం అయినప్పటికీ.. అధికారులు ఖచ్చితంగా విధులకు హాజరుకావాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.