నేటినుంచి శ్రావణశోభ

ప్రత్యేక పూజలుకు సిద్దం అయిన యాదాద్రి

యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఆషాఢ మాసం శనివారంతో ముగిసింది. ఆదివారం నుంచి శ్రావణమాసంప్రారంభం కానుంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రత్యేక పూజలకు సిద్దం అవుతోంది. భక్తిపర్వాలు.. పండగలు.. ఆలయ సందర్శనలు.. రాఖీబంధన్‌ వంటి శుభాలకు నెలవైన శ్రావణమాసం ఆదివారం ఆరంభమవుతోంది. శ్రావణ శుభగడియలు మొదలవుతున్న సందర్భంగా వేడుకల నిర్వహణకు శివకేశవుల ఆలయాలు సంసిద్ధమవుతున్నాయి. ఒక్కో మాసంలో ఒక్కో రీతిన భగవంతుడిని ఆరాధించడం ఆచారం.ఆ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రావణ వేడుకలకు సమయం సవిూపిస్తోంది. శుభపర్వాలు, ఆధ్యాత్మిక తతంగాలకు ఆదివారం తెరలేవనుంది. వ్రతాల మొక్కులు తీర్చుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆహ్లాదం పొందేందుకు శ్రావణమాసంలో భక్తులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. మరో అన్నవరం క్షేత్రంలా శ్రావణ వేడుకల్లో భాగంగా యాదాద్రిలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ జరుగుతుంది. శ్రావణం వచ్చిందంటే పలు ప్రాంతాలకు చెందిన భక్తజనులు శివకేశవుల సందర్శనకు ఆసక్తివహిస్తారు. పూజలు, వ్రతాల నిర్వహణపై శ్రద్ధ వహించే మాసమే శ్రావణం. వివిధ శుభపర్వాలకు నెలవైన శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం, ఆండాళ్‌ తిరునక్షత్రం, నాగపంచమి,గరుఢ జయంతి, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి, స్మార్ధకృష్ణ జయంతితోపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. మహాలక్ష్మీ కరుణించే శ్రావణంలోనే ప్రతి శుక్రవారం లక్ష్మీవ్రతం నిర్వహించడం సంప్రదాయం. మహిళా భక్తులు కుటుంబ సంక్షేమానికి ఆ వ్రతాన్ని నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ, శివారాధనలకు భక్తులు ఆసక్తి వహిస్తారు. శ్రీ సుదర్శన ఆళ్వారుల తిరునక్షత్రం, హయగ్రీవ జయంతి వేడుకలు కూడా ఈ మాసంలోనే జరుగుతాయి. ప్రకృతి పరంగా పంటలకు సహకరించే మాసం కూడా శ్రావణమే. అన్ని విధాలా ప్రజాసంక్షేమానికి దోహదపడే శ్రావణంలో క్షేత్ర సందర్శన మానవ కల్యాణానికి దోహదం కాగలదని యాదాద్రి ఆలయ ప్రధాన పూజారులు అంటున్నారు.