నేటి నుంచి హజారే ప్రజాతంత్ర యాత్ర

అమృత్‌సర్‌, ముంబై : కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా ఉద్యమాన్ని నడిపే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ‘జనతంత్రయాత్ర’ ను చేపడుతున్నట్లు లోక్‌పాల్‌ ఉద్యమాకారుడు అన్నా హజారే ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఆదివారం ఈ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నా హజారే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘జనతంత్రయాత్ర’ నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని వివరించారు. ఈ యాత్ర గురించి అన్ని రాజకీయ పార్టీలకూ లేఖలు రాశానని…. అయితే ఏ ఒక్క పార్టీ దానిపై స్పందించలేదని విమర్శించారు. 25 పాయింట్ల ఎజెండాతో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏకు వ్యతిరేకంగా ప్రజామద్దతును కూడగట్టడం కోసం ‘ప్రజాతంత్రయాత్ర’ ను చేపడుతున్నామన్నారు. ‘జన్‌లోక్‌పాల్‌ బిల్‌’ ‘రైట్‌ టూ రిజెక్ట్‌’ గురించి ప్రజలకు అవగాహన పెంపొందించి, వారిని జాగృతపచాల్సిన అవసరం ఉందని హజారే అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యయం లేదా ప్రజావిప్లవం వల్లనే దేశంలో మార్పు సంభవమవుతుందని వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలన్నీ ఐక్యం కావాలని, వేరు వేరుగా పోరాడితే శక్తి సన్నగిల్లుతుందని అన్నారు. అలాగే మరో ఐదు నెలల తర్వాత ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘జన్‌ సంసద్‌’ (పబ్లిక్‌ ర్యాలీ) ను నిర్వహించనున్నట్లు తెలిపారు.