నేటి నుండి బైరెడ్డి 92 గంటల దీక్ష
కర్నూలు, ఆగస్టు 3 : రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఒక వేళ విభజిస్తే మూడు ప్రాంతాలుగా విడగొట్టాలని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి శుక్రవారం ఇక్కడ డిమాండ్ చేశారు. శనివారం నుండి 92 గంటలపాటు దీక్ష చేపడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈమేరకు విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. స్వార్థపర రాజకీయల కోసం కేంద్రం కుటిల ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఒకప్పుటి కర్నూలు రాజధానిని మూడు ప్రాంతాలు సమైక్యంగా ఉండేందుకు హైదరాబాద్‌కు మార్చారని అన్నారు. ఈ మార్పు వల్ల రాయలసీమ పూర్తిగా వెనుకపడిపోయిందని ఉదహరణలతో గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొడితే మూడు రాష్ట్రాలుగా చేయాలని అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రం జాప్యం చేయకుండా సరైన తీసుకోవాలని కోరుతూ తాను ఈ దీక్షను చేపడతున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం హంద్రీ నది ఒడ్డునగల ప్రధాన రహదారిపైనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద దీక్ష చేపడతున్నట్లు ఆయన తెలిపారు.