నేటి యుద్ధ రంగం అత్యంత సంక్లిష్టమైంది
ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా
యుద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
పుణెళి, నవంబర్7( జనం సాక్షి ): నేటి కాలంలో యుద్ధ రంగం అత్యంత సంక్లిష్టమైనదని ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బడౌరియా శనివారం చెప్పారు. సంక్లిష్టత, విభిన్న కోణాలుగల యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. భద్రతాపరంగా అనూహ్య పరిస్థితులు ఎదురుకావచ్చునన్నారు. అనేక రూపాల్లో ఎదురయ్యే హైబ్రిడ్ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేషనల్ డిఫెన్స్ అకాడవిూ క్యాడెట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
మన దేశంలో త్రివిధ దళాలకు కలిపి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని సష్టించడాన్ని బడౌరియా ప్రశంసించారు. మన దేశంలో అత్యున్నత స్థాయి రక్షణ రంగ సంస్కరణలు జరిగే చరిత్రాత్మక దశకు ఇది ప్రారంభమని తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడవిూ అనుభవాన్ని సంబంధిత రంగాలకు విస్తరించవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థలో ఏర్పడిన మైత్రీ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలన్నారు. కోర్సు నేర్చుకునే సమయంలో పరిచయమైనవారితోనూ, స్క్వాడ్రన్‌మ్ఖేట్స్‌తోనూ ఏర్పడిన అనుబంధాన్ని
కొనసాగించాలన్నారు. ఈ అనుబంధాన్ని కెరీర్‌లోని ప్రతి దశలోనూ కలిసికట్టుగా పని చేయగలిగే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోవాలని కోరారు. సంక్లిష్టత, విభిన్న కోణాలుగల యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, భద్రతాపరంగా అనూహ్య పరిస్థితులు ఎదురుకావచ్చునని, అనేక రూపాల్లో ఎదురయ్యే హైబ్రిడ్ ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దీని కోసం క్యాడెట్లకు అత్యున్నత స్థాయిలో పరిజ్ఞానం, అంకితభావం, నిబద్ధత, త్యాగశీలత అవసరమని చెప్పారు. అన్ని స్థాయుల్లోనూ, అన్ని వేళలా నాయకత్వం అవసరమని తెలిపారు. ప్రతి సర్వీస్, ఈ దేశం క్యాడెట్ల నుంచి దీనినే ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.