నేటి సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారీగా బతుకమ్మలతో ఊరేగింపు తీసి నిమజ్జనం చేసేవరకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి రానున్నారు. గత వారం రోజులుగా జోరుగా సాగుతున్న ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగియ నున్నాయి.  బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీష అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పట్టణంలోని ఖానాపూర్‌ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్‌ వద్ద  ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలి వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఖానాపూర్‌ చెరువు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మెట్లు నిర్మించామని, తాగునీటి సదుపాయం, లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా కార్మికులను నియమించామని తెలిపారు. చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను, సహాయకులను నియమించామన్నారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏ ర్పాట్లు చేసింది. పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు డిపోల వారీగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. బస్సుల్లో సీట్లు దొరక్క చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తారు. ఇదే అదనుగా భావించి వారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తారు. దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పండుగ అనంతరం అక్టోబర్‌ 2తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రజలు తిరిగి వెళ్లేందుకు బస్సులను సిద్ధం చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు మరిన్ని బస్సులను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.