నేడుదేశవ్యాప్త సార్వాత్రిక సమ్మె

C

– స్థంభించనున్న జనజీనం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి):కార్మిక సంఘాల పిలుపుమేరకు నేడు దేశవ్యాప్తంగా సమ్మె సైరన్‌ మోగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ, కార్మిక మంత్రి దత్తాత్రేయలు సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా కార్మిక సంఘాలు పట్టించుకోలేదు. సెప్టెంబర్‌ రెండున శుక్రవారం మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపాలని ఆయా రాష్ట్రాల్లో కార్మిక నేతలు కోరారు. దీంతో అనేక సంస్థలుమూతపడనున్నాయి. బ్యాంకుల్లు కూడా మూతపడనున్నాయి. సమ్మె కారణంగా వేలకోట్ల నష్టం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరశిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు పలికాయి. లెఫ్ట్‌ పార్టీలు ప్రధానంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇన్సురెన్స్‌ బ్యాంకు, డిఫెన్స్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఫెడరేషన్లతోపాటు భారత గుర్తింపు పొందిన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగబోయే సమ్మెకు సంపూర్ణ మద్దతును ఇవ్వడంతోపాటు వారికి అండగా ఉంటామన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై మరోమారు లెఫ్ట్‌ కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కార్మిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఇటీవల కార్పోరేట్‌ అనుకూల ధోరఇతో ఉన్నాయి. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలనే డిమాండ్‌తో సెప్టెంబరు 2న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలన్న పిలుపుతో దేవవ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది.  దేశవ్యాప్త సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాల్‌గా నిలువనుంది. గతేడాది కూడా ఇలాగే వామపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తం అందోళనకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా అసంఘటిత రంగంలో ఆందోళన తీవ్రంగా ఉంది. వివిధ స్థాయిల్లో ఉద్యోగ,కార్మిక రంగాల్లో భద్రత భయపెడుతోంది. ప్రపంచీకరణ కారణంగా కార్మిక రంగం ఒత్తిడికి గురవుతూనే ఉందని ఆందోళన చెందుతున్నారు.  అంతేగాకుండా తీవ్ర ఆటుపోట్లకు కార్మికులు గురవుతున్నారు. వీరి హక్కులకు భంగం వాటిల్లుతోంది. ఈ దశలో ప్రభుత్వాల తీరునకు నిరసనగా సెప్టెంబర్‌ రెండున తలపెట్టిన ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మరోసారి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సంఘటితం కావాల్సిన ఆవసరం ఉన్నదని, నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసేవరకు ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా  దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  గ్రాట్యుటీ, ఈఎస్‌ఐ తదితర అన్ని సదుపాయాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె పిలుపుపై పునరాలోచన లేదని ఎంపి, సిఐటియు ప్రధాన కార్యదర్శి  తపన్‌ సేన్‌ స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న సానకూల చర్యల నేపథ్యంలో సెప్టెంబరు 2న జరిగే సార్వత్రిక సమ్మెను పున:పరిశీలించాల్సిందిగా కోరుతూ కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాసారు.  డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి మంత్రి రాసిన లేఖలో గానీ, దాంతో జతపరిచిన పత్రాల్లో గాని తమకు ఎలాంటి పరిష్కారాలు, పురోగతి కనిపించలేదని తపన్‌సేన్‌ పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన మోడీతో పాటు వివిధ రాస్ట్రాల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులతోపాటు ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. బిజెపి తన రెండున్నర  సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదన్నారు. విదేశీ పెట్టుబడులకోసం విదేశాలకు తిరుగుతూ కార్మిక సంక్షేమాన్ని పూర్తీగా విస్మరించారన్నారు. కార్మికులు తాము ఎదుర్కొనే సమస్యలను చెప్పుకోవాలని అడిగితే సమయం లేదంటూ దాట వేస్తున్నారని విమర్శించారు. పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని  ఆరోపించారు.  ఏడాది క్రితం ఏ వివరాలైతే తమకు అందచేశారో దాదాపు అవే వివరాలు ఇప్పటి పత్రాల్లో వున్నాయని ఆయన మంత్రికి రాసిన లేఖలో తెలిపారు. కార్మిక వర్గాన్ని, మొత్తంగా కార్మికోద్యమాన్ని పక్కకు నెట్టి వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా దుస్తుల తయారీ రంగంలో ఫిక్స్‌డు టర్మ్‌ ఉపాధిని ప్రవేశపెట్టడం, ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించడం ద్వారా మూడు మాసాలకు గల 50గంటల ఓవర్‌టైమ్‌ వర్క్‌ను 125గంటలకు పెంచడానికి అనుమతించడం, ఇపిఎఫ్‌లో గల కార్మికుల సొమ్మును షేర్‌ మార్కెట్‌కు తరలించడం, కార్మికుల ఇపిఎఫ్‌ మొత్తాలను ఇతర ప్రయోజనాలకు మళ్ళించడం, రోడ్డు రవాణా కార్మికులపై మూకుమ్మడిగా దాడి చేసేలా మోటారు వాహనాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడం వంటి చర్యలను మోడీ సర్కార్‌ తీసుకుంటోందని తపన్‌సేన్‌ విమర్శించారు. ఈ చర్యలన్నీ కూడా కార్మికుల హక్కులను, వారి ప్రయోజనా లను నీరుగార్చేవనేనని అన్నారు. వీటిని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయన్నారు. ఈ చర్యల నేపథ్యంలో సమ్మె పిలుపుపై పునరాలోచించుకోవడం సాధ్యం కాదని తపన్‌సేన్‌ స్పష్టం చేశారు. పైగా సమ్మకు పిలుపిచ్చిన కార్మిక సంఘాల్లో భాగస్వామ్యం కాని యూనియన్‌ తో కార్మిక డిమాండ్ల పరిష్కారం కోసం ఏర్పడిన మంత్రుల బృందం చర్చలు జరిపిందని, తద్వారా ప్రభుత్వం అప్రజాస్వామిక విధానానికి పాల్పడిందని, వివక్ష చూపిందని విమర్శించారు. సమ్మెకు పిలుపిచ్చిన కార్మిక సంఘాలను నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు.

నేటి సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు

గకారమిక సమ్మెలో బ్యాకు ఉద్యోగులు కూడా పాల్గొనబోతున్నారు. కార్మికులు, ఉద్యోగులను వీధి పాలు చేసే సంస్కరణలకు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో తాము కూడా పాల్గొంటున్నామని బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శి పి వెంకట రామయ్య వెల్లడించారు. 2వతేదీ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొటున్నామని అన్నారు. కార్మికుల ఐక్యతను చాటి ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తామని అన్నారు. ఆర్‌బిఐ ఉద్యోగులు కూడా సమ్మెకు సన్నద్దం కావడంతో బ్యాంకింగ్‌ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయి సమ్మె విజయవంతం కానుందన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, అందుబాటులో లేని విద్యా, వైద్యం, పెరుగుతోన్న నిత్యావసర ధరలపై తాముకూడా గళం విప్పుతామని అన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న తిరోగమన సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఆర్‌బిఐ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, బ్యాంకింగ్‌, నాబార్డు ఉద్యోగులు, అధికారులు సెప్టెంబర్‌ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనడానికి సిద్దం అయ్యారని అన్నారు. స్టేట్‌ బ్యాంకులో అసోసియేట్‌ బ్యాంకుల విలీనం, రిజర్వు బ్యాంకు అధికారాలను నిర్వీర్యం చేయాలనే ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.  కార్పొరేట్ల మొండి బాకీలకు వత్తాసు పలుకుతోన్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఈ సమ్మెలో రెండు రాష్ట్రాల నుంచి 85,000 పైగా బ్యాంకింగ్‌, ఆర్‌బిఐ, నాబార్డు ఉద్యోగులు పాల్గొంటున్నారని పి వెంకట రామయ్య తెలిపారు.  బ్యాంకింగ్‌ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు సాధారణ ప్రజలకు ఒరింగిందేవిూ లేదని, పోగా  ప్రాధాన్యత రంగాలకు అవసరమైన రుణాలు అందకుండా చేసి ఒక్కొక్క కార్పొరేట్‌ కంపెనీకి లక్ష కోట్ల రూపాయల పరపతిని చేకూర్చే విధంగా బ్యాంకింగ్‌ రంగంలో మార్పులుచేపట్టారని విమర్శించారు. మోడీ సర్కార్‌ మరో అడుగు ముందుకు వేసి పిఎస్‌బిలకు కార్పొరేట్‌ వ్యక్తులను సిఇఒలుగా ఏర్పాటు చేస్తోందని, పైగా కార్పొరేట్లకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌లు ఇస్తోందని మండిపడ్డారు.  బ్యాంకింగ్‌ రంగంలో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.  ఖాతాదారులకు  వారికి మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది కొరత వెంటాడుతున్న పట్టించుకోవడం లేదన్నారు.  అలాగే భ్యాంకుల విలీన పక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. కార్పొరేట్ల మొండి బాకీల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ, నిండా ముంచుతోన్న ఆ వర్గాలకే వత్తాసు పలుకుతోందన్నారు.  దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని,  మొండి బాకీల వసూళ్లలో ప్రభుత్వ చొరవం తీసుకోవాలన్నారు. రిజర్వు బ్యాంకు అధికారాలను క్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఈ అధికారాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ లేదా ఇతర ప్రత్యక సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని కేంద్రం యోచిస్తోందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్‌బిఐ వ్యవహరాల్లో ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల జోక్యం మరింత పెరగనుందన్నారు. కేంద్రం తీసుకుంటున్న తిరోగమన చర్యల  కారణంగా ధరలు పెరుగుతున్నాయని, అయినా పట్టించుకోవడం లేదని, అందుకే సమ్మెలో పాల్గొని నిరసన తెలియచేస్తామని వెంకట రామయ్య అన్నారు.

బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది: కార్మిక సంఘాల వెల్లడి

పది కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2 శుక్రవారం ఇచ్చిన సమ్మె పిలుపు దేశాన్ని స్తంభింపజేయనుంది. ఈ సమ్మెలో 15 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. కనీస వేతనాలు పెంచాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కనీసం పది రాష్ట్రాల్లో  బంద్‌లాంటి వాతావరణం నెలకొననుందని, మిగతా రాష్ట్రాల్లోనూ జనజీవనం స్తంభిస్తుందని సంఘాలు స్పష్టంచేశాయి. ఇది గతేడాది సమ్మె కంటే పెద్దగా ఉండబోతోందని, దాదాపు ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికులంతా వీధుల్లోకి వచ్చి సమ్మె చేయనున్నారని ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ సెక్రటరీ అమరజీత్‌ కౌర్‌ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే స్థాయిలో ఉండబోతోందని ఆయన చెప్పారు. పది సంఘాల నేతలు ఏర్పాటుచేసిన సంయుక్త విూడియా సమావేశంలో ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. ఈ సమ్మె నుంచి భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ మాత్రం దూరంగా ఉంటోంది. రవాణా, ఆర్థిక, విద్యుత్‌, బొగ్గు, జౌళి, ఆటోమొబైల్‌, స్టీల్‌, ఆయిల్‌, రక్షణ ఉత్పత్తులు, విద్యారంగాలపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. బ్యాంకు యూనియన్లు కూడా నోటీసులు ఇవ్వడంతో బ్యాంకులపై కూడా సమ్మె ప్రభావం ఉండనుంది. అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.

బంద్‌ను వ్యతిరేకించిన మమత కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సెప్టెంబర్‌ 2 బంద్‌నుపశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యతిరేకించారు. బంద్‌ పేరుతో జనజీవనానికి అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ వేదికగా దీదీ హెచ్చరించారు. ‘సెప్టెంబర్‌ 2న బంగాల్‌ స్తంభించదు. విద్యాసంస్థలు, దుకాణాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు అన్నీ రేపు తెరుచుకునే ఉంటాయి. ప్రభుత్వ రవాణా కూడా అందుబాటులో ఉంటుంది. వీటికి ఎవరైనా అంతరాయం కలిగిస్తే.. వారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది’ అని మమత ట్వీట్‌ చేశారు. అంతేగాక.. బంద్‌ కారణంగా వాహనాలు, దుకాణాలు ధ్వంసమైతే వారికి ప్రభుత్వం పరిహారం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దాదాపు 15కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.