నేడు,రేపు పెద్దపల్లిలో కెసిఆర్‌ సభలు


29న రామగుండంలో, 30న మంథని, పెద్దపల్లిలో సభలు
భారీగా ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సోమారపు సత్యనారాయణ
పెద్దపల్లి,నవబంర్‌28(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో వరుస పర్యటనలతో ¬రెత్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో ఆరు నియోజకవర్గాలకు కలిపి ఏర్పాటు చేసిన రెండు ప్రజా ఆశ్వీరాద సభల్లో పాల్గొని ప్రచారం ¬రెత్తించారు. తాజాగా మరోసారి ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. ఈ సారి పెద్దపల్లి జిల్లాలో సభలకు హాజరుకానున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశ్వీరాద సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న రామగుండంలో, 30న మంథని, పెద్దపల్లిలో సభలు నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రామగుండం నియోజకవర్గ సభను గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 3:15 గంటలకు మంథని నియోజకవర్గ సభను మంథని శివారులోని మంథని- గోదావరిఖని రోడ్డు వద్ద  సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గ సభను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు.  ఈ సభల విజయవంతానికి మూడు ప్రాంతాల్లో  నేతలు ఏర్పాట్లను చేశారు.  రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఇప్పటికే పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ప్రజలను తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ నిర్వహించనున్న గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని సోమారపు సత్యనారాయణ మేయర్‌ జాలి రాజమణి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. 30వేల మంది కూర్చోనేందుకు వీలుగా తగిన ఏర్పా ట్లు చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు నాయకులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే సింగరేణి కార్మక సంఘంనేతలు కూడా సభల విజయవంతానికి పూనుకున్నారు. సింగరేణి ప్రాంతాల్లో 29, 30 తేదీల్లో జరగనున్న కేసీఆర్‌ బహిరంభ సభలను కార్మికవర్గం విజయవంతం చేయాలని తెబొగకాసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి కోరారు. ఇప్పటికే అనేక సమస్యలు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పరిష్కరించారని, మరికొన్నింటిని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల కోడ్‌ రావడంతో వాటి అమలు జరగలేదన్నారు. ఎన్నికల తర్వాత తెరాస అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించేలా తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ఒప్పంద కార్మికులకు వేతనాల పెంపు, వీఆర్‌ఎస్‌ ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు, కారుణ్య నియామకాల్లో సర్వీసు నిబంధన ఏడాదికి తగ్గించడం, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం వంటి డిమాండును త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కార్మికులు సొంతింటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని ప్రైవేట్‌ బ్యాంకుల్లో తీసుకొనే అవకాశం కల్పించేందుకు యాజమాన్యంతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబరులో కంపెనీ స్థాయి నిర్మాణాత్మక, జేసీసీ సమావేశాలు నిర్వహిస్తామని యాజమాన్యం హావిూ ఇచ్చిందని తెలిపారు. ఈ సభల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.