నేడు అంతర్జాతీయ యోగాదినం
– రాజ్‌పథ్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,జూన్20(జనంసాక్షి): మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి యావత్ ప్రపంచ వ్యాప్తంగా భారీగాఏర్పట్లు చేశారు. ఆదివారం ఒక మహాద్భుతం జరగబోతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయం నెరవేరబోతున్న వేళ ఇది. గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్ మాదిరిగా ఢిల్లీలో శుక్రవారం యోగారిహార్సల్ జరిగింది. రాజ్‌పథ్‌లోనూ, ఇండియాగేట్ పరిసరాల్లో యోగాకు చురకుగా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ రాజ్‌పథ్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో వేలమంది ప్రజలు యోగా సాధన చేసే ఈ కార్యక్రమం కోసం 5 వేల మంది సాయుధ సిబ్బందిని మోహరించనున్నారు. కార్యక్రమంలో 40 వేల మంది ప్రజలు, మంత్రులు, ఎంపీలు సహా 500 మంది ప్రముఖులు పాల్గొనవచ్చని భావిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తున్నామనీ, 30 కంపెనీల భద్రతా బలగాలను మోహరిస్తున్నామని దిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్‌బస్సీ తెలిపారు. గణతంత్ర దినోత్సవం స్థాయిలో
ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 192 దేశాలు ఒక ఉత్సవంగా దీనిని నిర్వహించడం భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలన్న ప్రతిపాదనను అత్యధిక దేశాలు ఆమోదించాయి. ప్రధాని చొరవతో, భారత అధికారుల కృషితో కేవలం 75 రోజుల్లో నిర్ణయం జరిగిపోయింది. నామమాత్రపు కార్యక్రమంలా గాకుండా తొలి యోగా దినోత్సవాన్ని అతి విస్తృతంగా, ఘనంగా నిర్వహించాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. భారత దౌత్యకార్యాలయాలు ప్రతి దేశంలోనూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ముప్పైవేల మందితో జరిగే కార్యక్రమానికి సుష్మాస్వరాజ్ హాజరవుతున్నారు. ఐరాస కార్యక్రమంలో బాన్‌కీమూన్ పాల్గొంటున్నారు. రాజపథ్‌లో యాభైమంది విదేశీ దౌత్యవేత్తలు ఒకచోట చేరడం కూడా రికార్డే. ఓ పాతిక జిల్లాలు మినహా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆదివారమైనప్పటికీ రైల్వే సహా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులూ ఇందులో పాలుపంచుకోవాలన్న ఆదేశాలు అమలుకాబోతున్నాయి.అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ఆదివారం దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండగా, కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో చేపట్టే కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొననుండగా, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో హాజరవుతారు. 30 వేలమందితో చెన్నైలో నిర్వహించే కార్యక్రమానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరవనుండగా, పర్యాటక మంత్రి మహేశ్‌శర్మ నోయిడాలో పాల్గొంటారు. హైదరాబాద్ సంజీవయ్యపార్క్‌లో చేపట్టే కార్యక్రమంలో ఆరోగ్యమంత్రి జేపీనడ్డా పాల్గొంటారు. తిరువనంతపురంలో న్యాయమంత్రి సదానందగౌడ, విూరఠ్‌లో రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఫిలిభిత్‌లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకాగాంధీ, గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్‌ఓరం ఒడిశాలో, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ సిమ్లాలో, సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ దిల్లీలో పాల్గొంటారు. ప్రభుత్వం కేంద్రమంత్రులకు వివిధ రాష్ట్రాల్లోని కార్యక్రమాలను కేటాయించినట్లు ఆయుష్ మంత్రి శ్రీపాదనాయక్ తెలిపారు.
రాజ్‌పథ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమం కోసం శుక్రవారం వేలమంది విభిన్న ఆసనాలు వేసి సాధన చేశారు. రాజ్‌పథ్‌లో 5 వేల మంది పారామిలటరీ సిబ్బంది పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.