నేడు ‘ఇండియా’ మూడో భేటి

` భేటీకి 28 పార్టీలు.. 63మంది ప్రతినిధులు
ముంబై(జనంసాక్షి):2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా వ్యూహ ప్రతివ్యూహాలకు క్షేత్రంగా నిలవనుంది. నేడు,రేపు ముంబయిలో ‘ఇండియా’ కూటమి మూడో భేటీ కానుంది.మరోవైపు, భాజపా సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సమావేశాలు జరగనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.’ఇండియా’ కూటమి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే లాలూ, మమతా బెనర్జీ వంటి నేతలు ఒక్కొక్కరుగా ముంబయికి చేరుకొంటున్నారు. బెంగళూరులో జరిగిన రెండో భేటీలో ఈ కూటమికి ఇండియాగా నామకరణం చేసిన నేతలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగబోయే ఈ కీలక సమావేశంలో నేతలు తమ లోగోను ఆవిష్కరించనున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటు అంశంపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, గత భేటీకి 26 పార్టీలు హాజరు కాగా.. ముంబయి భేటీకి మాత్రం 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు హాజరవుతారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ముంబయిలో ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ మార్పును తీసుకురావడంలో తమ కూటమి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు సీట్ల సర్దుబాటుపై తమ కూటమిలో చర్చ జరగలేదన్నారు. ఎన్సీపీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్న ఆయన.. ‘’వదిలేసి వెళ్లిన వారికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారు’’ అంటూ వ్యాఖ్యానించారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి గురించి విలేకర్లు పవార్‌ను ప్రశ్నించగా.. ఆమె ఏపక్షాన ఉన్నారో తెలియదన్నారు. ఇంతకుముందు ఆమె భాజపాతో చర్చలు జరిపారన్నారు. అనంతరం మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. విపక్ష కూటమిలోని పార్టీలకు సిద్ధాంతాలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. ‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై స్పందిస్తూ తమ కూటమిలో ప్రధాని అభ్యర్థులకు చాలా చాయిస్‌లు ఉన్నాయన్నారు. ఆ ఒక్కటి తప్ప భాజపాకు ఉన్న చాయిస్‌ ఏంటన్నారు. ‘ఇండియా’ కన్వీనర్‌ ఎవరన్న ప్రశ్నకు దీటుగా బదులిచ్చిన ఆయన.. మరి ఎన్డీయేకు కన్వీనర్‌ ఎవరంటూ ఎదురు ప్రశ్న వేశారు. 2019 ఎన్నికల్లో భాజపాయేతర పార్టీలకు 23 కోట్ల ఓట్లు రాగా.. భాజపాకు 22 కోట్ల ఓట్లు వచ్చాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ అన్నారు. తామంతా కలిసి పనిచేస్తే విజయం తథ్యమని విశ్వాసం వ్యక్తంచేశారు.బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి భేటీకి 26 పార్టీలు హాజరు కాగా.. ఈసారి భేటీకి 28 పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పవార్‌ వెల్లడిరచడంతో ఆ రెండు పార్టీలేవి? ఇంకేమైనా కొత్తగా వచ్చి చేరే అవకాశం ఉందా అనే ఆసక్తి నెలకొంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు చేయనున్నారు. ఇటీవల శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ఈశాన్య రాష్ట్రాల నుంచి కొన్ని పార్టీలు తమ కూటమిలో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.మరోవైపు, భాజపా సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పోటీగా అన్నట్టు రెండు రోజుల పాటు సమావేశాలకు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు సంబంధించి సవిూక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఆగస్టు 31న సీఎం ఏక్‌నాథ్‌ శిందే అధికారిక నివాసంలో భేటీ జరగనుండగా.. సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం సీఎం ఏక్‌నాథ్‌శిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ల సారథ్యంలో జరగనుంది.