నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు-ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, మే 31(జనంసాక్షి) : తెలంగాణలో సోమవారం జరిగే శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈరోజు సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశం సందర్భంగా శాసనమండలి ఎన్నికలఅంశం చర్చకు రాగా తెరాస ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే శాసనసభా పక్షం సమావేశం నిర్వహించి అందులో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అబివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అన్నారు. అక్రమంగా సీటు గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు చేసి ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపుతున్నారని సీఎం అన్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టిఆర్‌ఎస్ నుంచి మండలి అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లుతో పాటు అదనపు అభ్యర్థిగా యాదవరెడ్డిని తెరాస పోటీలోకి దించింది. టిడిపి మండలి అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డికి 16మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. 11మంది టిడిపి సభ్యులు సహా ఐదుగురు బిజెపి సభ్యులు నరేందర్‌రెడ్డికి మద్దతుగా సంతకాలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత నామినేషన్ వేశారు. అయితే రేవంత్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది.