నేడు కేబినెట్ భేటీ
హైదరాబాద్ సెప్టెంబర్1(జనంసాక్షి):
పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో జోష్ విూదున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటి పురోగతిపై సవిూక్షించేందుకు సిద్ధమవు తోంది. నేడు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శ కాలు, కొత్త ఎక్సైజ్ పాలసీ, రాబోయే అసెం బ్లీ సమావేశాల కసరత్తు, కాంట్రాక్ట్ ఉద్యో గుల రెగ్యులరైజేషన్ వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8న సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రేపటి మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.గత క్యాబినెట్ సమావేశాల నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే, గ్రామజ్యోతి కార్యక్రమం నడుస్తున్న తీరు, దానిపై ప్రజల అభిప్రాయాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నది.గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించినందుకు కేబినెట్ సహచరులను సీఎం కేసీఆర్ అభినందించనున్నారు.టీఎస్ పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు మొదలయ్యాయి. జులై నుంచి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. కానీ, ఆ స్థాయిలో రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో, మరిన్ని ఉద్యోగ నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పెంచిన వయోపరిమితి నిర్ణయానికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.వీటన్నిటికంటే మించి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేబినెట్ చర్చించనుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 40వేల మందిని రెగ్యులరైజ్ చేయాలని నివేదించింది. దీనిపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.ప్రాణహిత ప్రాజెక్టుపై కూడా క్యాబినేట్ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ ను టిఎస్ సర్కారు కోరింది. దీంతో, కాళేశ్వరం దగ్గరలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను వ్యాప్కోస్ ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీనితోపాటు ప్రభుత్వం రానున్న కాలంలో చేపట్టే నూతన పథకాలపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం. ప్రధానంగా గ్రామజ్యోతి తరహాలోనే పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక పథకం ప్రవేశపెట్టే అంశంపై కేబినేట్ లో చర్చించే అవకాశం ఉంది.