నేడు పాటియాలా కోర్టుకు సోనియా, రాహుల్‌

1సోనియా నివాసానికి రాహుల్‌!

ఢిల్లీ :  కాంగ్రెస్‌ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. టెన్‌ జన్‌పథ్‌ లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ఆయన ముందుగా సోనియా నివాసానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సోనియా, రాహుల్‌ లు కలిసి పాటియాలా కోర్టుకు బయలుదేరనున్నారు. ఇప్పటికే సోనియా నివాసానికి పలు సీనియర్ లీడర్లు వచ్చారు. వీరితో కేసుకు సంబంధించి సోనియా చర్చలు జరుపుతున్నారు.

దేశరాజధాని ఢిల్లీలో హైటెన్షన్ ప్రదర్శనలు..నిరసనలు..ర్యాలీలు..నినాదాలతో హోరెత్తబోతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటియాల కోర్ట్‌కు హాజరవుతున్న నేపధ్యంలో..రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ కన్పిస్తోంది. దీనికి తోడు, అవసరమైతే జైలుకు వెళ్తాం గానీ, బెయిల్‌ను మాత్రం కోరే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో పాటు , ఆ పార్టీ లీడర్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో, ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం కన్పిస్తోంది.
భారత న్యాయస్థానాలపై నమ్మకముందన్న సోనియా
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాటియాలా కోర్టుకు హాజరు అవుతున్నట్లు స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరుతానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని ఆమె వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌లు హాజరు కావాల్సిందేనని పాటియాలా కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
మధ్యాహ్నం ఒంటిగంటకు పాటియాలా కోర్టులో విచారణ
నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కేసు పాటియాలా కోర్టులో విచారణకు రానుంది. విచారణకు సోనియా, రాహుల్‌తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సమూహంగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా నేడు అందుబాటులో ఉండాలంటూ సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి మోతీలాల్‌ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, సుమన్‌ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన నిధులను పక్కదారి పట్టించారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో పిటిషన్ దాఖలు చేశారు.
సోనియా ఫైర్ బ్రాండ్ కామెంట్స్…
ఇలాంటి కేసులకు భయపడబోనంటూ,ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన సోనియా గాంధీ…తాను ఇందిరా గాంధీ కోడలినంటూ ఫైర్ బ్రాండ్ కామెంట్స్ చేసి…వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన దేశం దృష్టిని ఆకర్షించింది. అధికార పార్టీ తమపై కక్ష సాధిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. దీనిపై ఇతర పక్షాల నుంచి ఎన్ని విమర్శలొచ్చినా, కాంగ్రెస్ ఒకే స్టాండ్‌ మీదుంది. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే…కోర్ట్ తీర్పు వచ్చాక, మరింత దిగజారడం ఖాయంగా కన్పిస్తోంది.
సుబ్రహ్మణ్యస్వామికి భద్రత పెంపు
నేషనల్‌ హెరాల్డ్ కేసు పిటిషన్ దారుడు సుబ్రహ్మణ్య స్వామి భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే జడ్‌ కేటగిరీ భద్రత కలిగి ఉన్న స్వామికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ నివాస గృహాన్ని కేటాయించింది. కేబినేట్‌ కమిటీ సిఫార్సుల మేరకే స్వామికి ప్రభుత్వ వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనియా,రాహుల్ కోర్ట్‌కు హాజరయ్యే సమయంలో, పాటియాల కోర్ట్‌ బైట కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ప్రదర్శనలకు దిగబోతున్నారు… అటు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగే అవకాశముంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు స్వచ్ఛందంగా బంద్‌లు పాటించబోతున్నాయి.