నేడు బంద్ విజయవంతం చేయండి
– తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 9 జనంసాక్షి):
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఎన్కౌంటర్లపై ప్రభుత్వం విధానం ప్రకటించాలని తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక (టిడిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో గురువారం బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజల గొంతులను సిఎం కెసిఆర్ అణిచివేస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ఆశ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై కంటి తుడుపు చర్యలకు పూనుకుంటున్నారని, రైతుల ఆత్మహత్యల నివారణకు ఒకేసారి రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అహంకారపూరిత దోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నింటినీ సస్పెండ్ చేసి చివరకు సభను నిరవధిక వాయిదా వేసిన చరిత్ర కెసిఆర్‌కే దక్కిందన్నారు. విరసం రాష్ట్ర నాయకులు వరవరరావు, అరుణోదయ కళాకారిణి విమలక్క మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో ఉద్యమకారులపై కుట్రల కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్కౌంటర్ల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సంధ్య, తాండ్రకుమార్, భూతం వీరన్న, ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, ఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు గోవిందు, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు రాజేష్, తెలంగాణ ప్రజాప్రంట్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ కృష్ణ, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి బంద్‌ను విజయవంతం చేయండి
కాంగ్రెస్, టిడిపి, బిజెపి విజ్ఞప్తి
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆగ్రహం
ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్
రైతులను ఆదుకోవాలని, రుణమాఫీ ఒకేసారి చేయాలని, ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10న జరిగే తెలంగాణ బంద్‌ను జయప్రదం చేయాలని కాంగ్రెస్, టిడిపి, బిజెపి ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ నేతలు విలేకర్లతో మాట్లాడారు. టి పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టి టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, టిడిఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, టి బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్…. టిఆర్ఎస్ సర్కారు నిరంకుశ చర్యలను ఖండించారు. విపక్షాల సలహాలు, సూచనలు పట్టించుకోకపోగా, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. రుణమాఫీ ఏకకాలంలో చేస్తేనే, బ్యాంకులు కొత్తగా రుణాలు ఇస్తాయని చెప్పారు. ఎన్‌సిబిఆర్ ప్రకారం 1400 మంది రైతుల కుటుంబాలకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జూన్ రెండో తేదీ నుంచే వర్తింపజేయాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నదని చెప్పారు. రుణమాఫీ అమలు చేయడంలోనూ, ఆత్మహత్యల నివారణలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రం అంటూ రుణమాఫీ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల హావిూలను నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని అన్నారు. ఐదు నిమిషాల్లో 30 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో ఈనెల 10న జరగనున్న అఖిలపక్షాలు చేపడుతున్న తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సమాజం, విద్యా, వ్యాపార సంఘాలు, పాఠశాలలు, కాలేజీలు, రవాణా సంస్థలు బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టిడిపి, బిజెపి నేతలు 10న జరిగే బంద్‌పై ఉమ్మడిగా చర్చించారు. ఆ తరువాత కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అనంతరం విూడియాతో వేర్వేరుగా మాట్లాడారు.