నేడు మందమర్రికి చిన్నజీయర్ స్వామి రాక
మందమర్రి, జనంసాక్షి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి గురువారం మందమర్రికి వస్తున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే త్రయాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేకంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన 27 అడుగుల శ్రీ విరాట్ ఆంజనేస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతన హనుమాన్ ఆలయాన్ని ప్రారంభిస్తారు. అంతకు ముందు ఆలయంలో వీరాంజనేయస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ట, దృష్టికుంభం, నేత్రోన్మీలనం, శ్రీ భూనీలాసమేత వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని ఆలయ పూజారి అనంతాచార్యులు తెలిపారు. చిన్న జీయర్‌స్వామి, ఆయన శిష్య బృందం విడిది చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుదీపాల వెలుగులో ఆలయం హోమం జరిగే ప్రాంగణం వెలిగిపోతోంది. మహకుంభాభీషేకం సందర్భంగా మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల పట్టణాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానుండడంతో ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సహాకారంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, గుండా మల్లేష్‌తో పాటు మందమర్రి సీఐ రఘునందన్, సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎంఎన్ వెంకట్రామయ్య దంపతులు పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.




