నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ


కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు
తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధ్‌లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులు విభేదాలు వీడి సభలను సక్సెస్‌ చేసే పనిలో పడ్డారు. 27వ తేదీన కూడా రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. అయితే.. 20వ తేదీ రాహుల్‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే టీపీసీసీ ఖరారు చేసింది.  ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల సభల్లో రాహుల్‌ పాల్గొంటారు. ఇందుకోసం టీపీసీసీ పెద్ద
భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్‌ సభలతో రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని యోచిస్తోంది. 27వ తేదీ రాహుల్‌ టూర్‌ ఖరారైనా.. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో 27న సభలు నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు.
/ూహుల్‌ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చేపట్టిన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. షెడ్యూల్‌ ప్రకారం  మహబూబ్‌నగర్‌ నుంచి నల్లగొండకు రావాల్సిన ప్రచార యాత్ర మహబూబ్‌నగర్‌లోనే నిలిచిపోయింది. రాహుల్‌ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రచార కమిటీ బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తోందని, అందుకే ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. అయితే, రెండ్రోజుల అనంతరం సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  అయితే ప్రచారంలో భాగంగా రాహుల్‌ ఖమ్మం కూడా వస్తారని అంటున్నారు. ఈనెల 27న ఖమ్మం జిల్లాకు రానున్నారని,  బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తొలివిడతగా ఈనెల 20వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనే రాహుల్‌ గాంధీ.. రెండో విడతలో ఖమ్మం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో రెండుచోట్ల రాహుల్‌ గాంధీ బహిరంగ సభలను నిర్వహించాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఏయే ప్రాంతాలు అనువుగా ఉంటాయనే అంశంపై వివిధ కోణాల్లో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్‌ గాంధీ బహిరంగ సభ నిర్వహిస్తే ఇటు భద్రాద్రి  కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఖమ్మంలో పర్యటన ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. ఉదయం ఒక జిల్లాలో బహిరంగ సభ ఉంటే.. మధ్యాహ్నం మరో జిల్లాలో సభ ఉండేలా కాంగ్రెస్‌ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రచారయాత్ర ఈనెల 16వ తేదీన ఖమ్మం జిల్లాకు రావాల్సి ఉంది. అయితే ఈనెల 20న రాహుల్‌ గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా భైంసాకు వస్తుండడంతో ప్రచార యాత్రను వాయిదా వేశారు. ఈనెల 20న బోనకల్‌, తల్లాడ, 21న కొత్తగూడెంలో జరిగే కాంగ్రెస్‌ ప్రచార యాత్ర, సభలు సైతం వాయిదాపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాకు రావడం ఇదే మొదటిసారి కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులను సభకు భారీగా తరలించి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. కాగా.. రాహుల్‌ గాంధీ ఖమ్మం పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో పార్టీ అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.