నేడు రాష్ట్రపతితో స్టాలిన్‌ భేటీ

చెన్నై,ఆగస్టు30 : తమిళనాడు రాజకీయ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. పళనిస్వామి సర్కారును బలపరీక్షకు ఆదేశించాలని డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ గురువారం రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ని కోరనున్నారు. ఈ మేరకు స్టాలిన్‌ అపాయింట్‌ మెంట్‌ తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దినకరన్‌ ప్రయత్నిస్తున్నందున ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే నేత స్టాలిన్‌ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ నేతలు గవర్నర్‌ ను కలిసి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని కోరారు. గవర్నర్‌ తాజాగా ఇందుకు నో చెప్పటంతో స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పంచాయితీని రాష్ట్రపతి వద్దే

తేల్చుకోవాలని ఢిల్లీ చేరుకున్న స్టాలిన్‌ తమిళనాడులో రాజకీయ పరిస్థితిని ఆయనకు వివరించనున్నారు. బల పరీక్షకు ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని స్టాలిన్‌ చెప్పారు. ఇదే అంశంపై దినకరన్‌ సైతం రాష్ట్రపతిని కలుస్తానని వెల్లడించారు.