నేడు రెండోవిడత పంచాయితీ
భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి
సమస్యాత్మక గ్రామాల్లో భారీగా బందోబస్తు
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. రెండో విడుత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవరాం 25న రెండో విడత పోలింగ్ నిర్వహించడానికి అధికారులు సన్నద్దం చేశారు. పోలీస్‌శాఖ కూడా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక గ్రామాల్లో ముందే ఏర్పాట్లు చేశారు. రెండో విడుతలో మొత్తం 4 వేల 135 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 788 గ్రామాల్లో అభ్యర్థులను ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 3 వేల 342 గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడుత పోలింగ్ జరగనున్నది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. మొదటి విడుతలో పలు కారణాలతో వాయిదా పడిన రెండు గ్రామ పంచాయతీల్లోని రెండు వార్డులకు కూడా శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ముంజాలకుంట రెండో వార్డుతో పాటు.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమన్‌పల్లి ఎనిమిదో వార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు మూడో విడుత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో.. అభ్యర్థుల ప్రచారం ముమ్మరం చేశారు. ప్లలెలన్నీ ప్రచారంతో ¬రెత్తుతున్నాయి. రెండో విడుత ఎన్నికలలో జరిగే పలు ప్రాంతాల్లో.. కేటాయించిన రిజర్వేషన్లకు చెందిన సామాజికవర్గాలు లేక.. నామినేషన్లు దాఖలు కాలేదు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలలో ఒక్కొ గ్రామ పంచాయతీలో నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం 3వేల 342 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా.. 10 వేల 668 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా పంచాయతీలలో మొత్తం 36 వేల 602 వార్డు స్థానాలకు గాను.. 10 వేల 317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 94 వార్డులకు రిజర్వేషన్లు అనుకూలించక.. నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో.. మొత్తం 26 వేల 191 వార్డులకు పోలింగ్ జరుగుతుండగా.. 63 వేల 480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.